ఆన్ లైన్లో తండ్రి అంత్యక్రియలకు హాజరు

రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో బుక్ చేసి తెప్పించుకోవడం ఇప్పుడు మామూలై పోయింది. హరియాణలో ఒక కూతురు ఒక అడుగు ముందుకేసి తండ్రి అంత్యక్రియలను ఆన్ లైన్లో చూడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హతవిధి… మానవ సంబంధాలు ఏ స్థాయికి దిగజారాయో కదా అని కొందరు పెద్దలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంతకూ ఏమి జరిగిందంటే….

హరియాణలోని సోనిపట్ లో వస్త్ర వ్యాపారం చేసే శివ చరణ్ గుప్తాకు ముగ్గురు కూతుళ్లు. ముగ్గురికీ పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపారు. వీరిలో ఒక కూతురు విదేశాల్లో ఉండగా మిగిలిన వారు ముంబై లో ఉంటున్నారు. భార్య చనిపోవడంతో ఆయన కొన్నాళ్లుగా స్థానికంగా వున్న ఒక వృద్ధాశ్రమంలో తలదాచుకుంటున్నారు.

సోమవారం శివచరణ్ గుప్తా వృద్దాప్యంతో చనిపోయారు. తండ్రి మృతి చెందిన ఈ సమాచారాన్ని వృద్దాశ్రమ నిర్వాహకులు కూతుళ్ళకు తెలియజేశారు. తాము అంత్యక్రియలకు హాజరు కాలేమని, మీరే అంత్యక్రియలు నిర్వహించాలని కూతుళ్లు చెప్పిన సమాధానం విని నిర్వాహకులు బిత్తర పోయారు. దాంతో ఒక స్వచ్చంద సంస్థ ఆ పెద్దాయన అంత్యక్రియలు నిర్వహించింది.

విదేశాల్లో వున్న పెద్ద కూతురు మాత్రం వీడియో కాల్ చేసి తండ్రి అంత్యక్రియలను తిలకించింది. త్వరగా అంత్యక్రియలు పూర్తి చేస్తే తాము భోజనం చేయాలని చెప్పింది. తండ్రి ఆస్థికలు తీసుకొని రమ్మంటారా అని అడిగితే ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దామని బదులిచ్చింది. సోషల్ మీడియా లో వచ్చిన ఈ వీడియా చూసి చాలా మంది నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటన కన్నీళ్లు పెట్టించిందని కొందరు వ్యాఖ్యనిస్తున్నారు.