సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే… ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగానే సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పుల్లోనూ విశాల దృక్పథం చూపిస్తోంది. ఇప్పటిదాకా కేవలం వివాహం జరిగిన జంటలకే పరిమితం అయిన గృహ హింస కేసులు ఇకపై సహజీవనం చేసే జంటలకూ వర్తిస్తుందని తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వెరసి ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ లో మహిళపై పురుషుడు తన పైత్యం చూపిస్తే…గృహ హింసను ఎదుర్కోక తప్పదన్నమాట.

సంప్రదాయ పోకడలకు అత్యధిక ప్రాదాన్యం ఇచ్చే భారత్ లోనూ ఇటీవలి కాలంలో సహజీవనం తరహా సంబంధాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతకొంత కాలంగా దేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ లివ్ ఇన్ రిలేషన్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడున్నా పురుషుడు తన పురుషాధిక్యతను ప్రదర్శించేందుకే ప్రాధాన్యం ఇస్తాడు కదా. అలాగే కర్ణాటకకు చెందిన ఓ సహజీవనంలో… మగాడు మహిళపై తన బుద్ధి చూపించుకున్నాడు. అయితే ఈ వ్యవహారంపై కేసు నమోదుకు పోలీసులు సహకరించలేదేమో… బాధిత మహిళ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

లివ్ ఇన్ రిలేషన్ లో తనపై తన ప్రియుడు వేధింపులకు పాల్పడ్డాడని, ఈ నేపథ్యంలో పెళ్లి జరిగితే గృహ హింస అనే నిబంధనను తొలగించి మరీ తనకు న్యాయం చేయాలని సదరు మహిళ సుప్రీంను వేడుకుంది. బాధిత మహిళ వాదనను విన్న సర్వోన్నత న్యాయస్థాయం… పెళ్లి చేసుకున్నా, లివ్ ఇన్ లో ఉన్నా మగాడు ఆడదానిపై వేధింపులకు పాల్పడటం సరికాదని అభిప్రాయపడింది. సహజీవన సంబంధాల్లోనూ ఈ తరహా ఫిర్యాదులు వస్తే,… సెక్షన్ 498ఏ కింద గృహ హింస కేసు నమోదు చేయవచ్చని తెలిపింది. అయితే సదరు లివ్ ఇన్ రిలేషన్ ను పెళ్లిగా మార్చుకునేందుకు బాధిత మహిళ అంగీకరిస్తేనే కేసు నమోదు చేయాలని కోర్టు తేల్చి చెప్పింది.