భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చాలా రోజుల తరువాత ఒక సాధారణ ఉద్యోగిలా దర్శనమిచ్చాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లిన టెస్ట్ జట్టులో అతనికి చోటు దక్కలేదు, ఆగస్టు చివర్లో మొదలయ్యే దేశవాళీ టోర్నీలకు కూడా ఇంకాస్త సమయం ఉంది. ఈ ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా అతను పట్నాలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ అసిస్టెంట్ మేనేజర్‌గా తన విధులు ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
స్పోర్ట్స్ కోటా కింద రిజర్వ్ బ్యాంక్‌లో ఇషాన్ కిషన్‌కు ఈ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం లభించిన విషయం తెలిసిందే. కానీ ఎప్పుడూ కూడా ఆఫీస్ లో ఒక ఉద్యోగిలా ఉన్న పోటోలు బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఆఫీస్‌లో మెడలో బ్లూ కలర్ ఐడీ కార్డు వేసుకుని తోటి ఉద్యోగులతో కలిసి అతను దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రౌండ్ లో దూకుడుగా బ్యాటింగ్ చేసే ఈ యంగ్ సెన్సేషన్, ఇలా సైలెంట్‌గా ఆఫీస్ వాతావరణంలో ఫార్మల్ డ్రెస్‌లో కనిపించడంతో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తోంది.
నిజానికి రిజర్వ్ బ్యాంక్‌తో ఇషాన్ కిషన్‌కు చాలా మంచి అనుబంధం ఉంది. గతంలో కూడా క్రికెట్ నుంచి బ్రేక్ దొరికినప్పుడు అతను నవీ ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో జరిగిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో ఆర్‌బీఐ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈసారి ఏకంగా పట్నా బ్రాంచ్‌కు వచ్చి పూర్తిస్థాయిలో ఒక అసిస్టెంట్ మేనేజర్‌గా బ్యాంకింగ్ విధులను పర్యవేక్షిస్తుండటం విశేషం. ఖాళీ దొరికినప్పుడు ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నాడు.
ఈ ఆఫీస్ డ్యూటీకి ముగింపు పలికి త్వరలోనే అతను మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో ఇషాన్ బరిలోకి దిగనున్నాడు. ఈ దేశవాళీ టోర్నమెంట్‌లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా అతను వ్యవహరించబోతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో మళ్లీ తన సత్తా చాటి భారత జట్టులో తిరిగి స్థానం సంపాదించాలనే పట్టుదలతో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టనున్నాడు. దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగుతున్న ఈస్ట్ జోన్ జట్టులో ఇషాన్ కిషన్ నాయకత్వంలో అనేక మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, అభిమన్యు ఈశ్వరన్, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, వైభవ్ సూర్యవంశీ లాంటి ప్రసిద్ధ క్రికెటర్లు ఈ జట్టులో ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates