యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే… ఇతర ప్రాంతాల గురించి అటుంచితే… ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే భావన వ్యక్తమవుతోంది. మునుపటి మాదిరిగా వందలు, వేల సంఖ్యలో కరోనా కేసులు లేకున్నా… అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలు వెలువడే స్థాయిలో మాత్రం కొత్త కేసులు నమోదయ్యాయి. గత నెల 26 నుంచి గురువారం వరకు నమోదు అయిన కేసుల వివరాలే ఈ తరహా అప్రమత్తతను చాటి చెబుతున్నాయి.
దాదాపుగా రెండేళ్లకు పైబడి కరోనా విశ్వవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. వేలు దాటి లక్షల సంఖ్యలో జనం ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఇతర దేశాల మాదిరే భారత్ లోనూ ఈ వైరస్ పెను ప్రకంపనలే సృష్టించింది. అయితే గడచిన నాలుగేళ్లుగా పెద్దగా కేసులు లేకున్నా… అడపాదడపా అక్కడొకటి, ఇక్కడొకటి అన్నచందంగా అప్పుడప్పుడే కరోనా కేసులు నమోదు అయినా పెద్ద ప్రమాదమేమీ లేదనే చెప్పాలి. అయితే కరోనా వైరస్ ను ఈజీగా పరిగణించరాదన్న రీతిలో ఏపీటో ఇప్పుడు వరుసగా కేసులు నమోదు అయ్యాయి. ఏకంగా నలుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు.
ఏపీలో గడచిన 20 రోజుల వ్యవధిలో ఏకంగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో అత్యధికం కడప జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. ఒక్క కడప జిల్లాలోనే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక గుంటూరు జిల్లాలో రెండు, విశాఖ, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి.
కరోనా సోకిన 12 మందిలో ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా… ముగ్గురు కోలుకున్నారు. ఇక మిగిలిన వారిలో ముగ్గురు హోం ఐపోలేషన్ లో ఉండగా… ఇద్దరు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీ ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates