తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు చోటుచేసుకున్న రెండు విషాద ఘటనలు సమాజాన్ని కలచివేశాయి. తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన కొడుకులే మద్యం, మత్తు వ్యసనాలకు బానిసై నిత్యం వేధింపులకు దిగడంతో.. చివరకు కన్నబిడ్డలనే హత్య చేసే పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణలోని సూర్యాపేట పట్టణం సుందరయ్యనగర్‌లో భూక్యా అచ్చి అనే మహిళ తన కుమారుడు విజయ్‌ను గొడ్డలితో నరికి చంపింది. భర్త మరణం తర్వాత కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసిన ఆమె, కొడుకు తనకు అండగా ఉంటాడని ఆశపడింది. అయితే ఇంటర్ వరకు చదివిన విజయ్ మద్యం, మత్తు పదార్థాలకు బానిసై ప్రతిరోజూ డబ్బు కోసం తల్లిని వేధిస్తున్నాడని సమాచారం. ఈ వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన అచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
అదేరోజు గుంటూరు జిల్లా తెనాలి నాజరుపేటలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కోటేశ్వరరావు అనే వ్యక్తి మద్యం మత్తులో నిత్యం తల్లిదండ్రులతో గొడవపడుతూ, రెండు సెంట్ల భూమిని తన పేరుపై రాయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మరోసారి జరిగిన ఘర్షణలో తల్లిదండ్రులే అతని గొంతు కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం, మత్తు వ్యసనాలు కుటుంబ బంధాలను ఛిద్రం చేస్తున్నాయి. జీవితాంతం పిల్లల కోసం కష్టపడిన తల్లిదండ్రులే, చివరకు వారి వేధింపులు భరించలేక హంతకులుగా మారాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇది కేవలం రెండు కుటుంబాలలో జరిగిన విషాదం మాత్రమే కాదు.. వ్యసనాలు, కుటుంబ హింస, మానసిక ఒత్తిడి ఎంత ప్రమాదకర స్థాయికి చేరాయో చెప్పే హెచ్చరిక…!
Gulte Telugu Telugu Political and Movie News Updates