వావివ‌రుస‌లు మ‌రిచారు: మాతంగి భవిష్యవాణి

తెలంగాణ‌లోని ప్ర‌ఖ్యాత సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మవారి ఆల‌యంలో సోమ‌వారం ఉదయం భ‌విస్య‌వాణిని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారిని ఆవాహ‌నం చేసుకున్న స్వ‌ర్ణ‌ల‌త‌.. భ‌విష్య వాణిని వినిపించారు. కంట తడి పెట్టిన మాతంగి.. ఆల‌య పున‌ర్నిర్మాణంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విగ్రహ ప్రతిష్ట ఎందుకు చేయడం లేదని ప్ర‌శ్నించ‌డంతోపాటు.. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ట జరగాలని నిర్దేశించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. దీనికి అడ్డొచ్చిన వారిని పాదాల కింద నలిపేస్తాన‌ని హెచ్చ‌రించారు.

ఇక‌, స‌మాజంలో వావివ‌రుస‌లు లేకుండా పోయాయ‌ని మాతంగి పేర్కొన్నారు. ప్ర‌జ‌లు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నందుకే క‌ష్టాలు ప‌డుతున్నార‌ని తెలిపారు. ఈ ఏడాది భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని వెల్ల‌డించారు. “వావి వరసలు లేకుండా ప్రజలు వ్యవహారిస్తున్నారు. మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలి. ఏ ఆపద వచ్చినా ప్రమాదం నుంచి కాపాడుతున్నా. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ  ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి“ అని మాతంగి స్వర్ణలత భ‌విష్య‌వాణి వినిపించారు.

కుంభవర్షాలతో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ప్రాణనష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని మాతంగి హెచ్చరించారు. వావివరసలు లేకుండా జనాలు ప్రవర్తిస్తున్నార‌ని, దీనివ‌ల్ల స‌మాజంలో అంటు వ్యాధులు వ‌స్తాయ‌ని స్వర్ణలత తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో భారీ సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు. ప‌లువురు నాయ‌కులు కూడా హాజ‌ర‌య్యారు. ఏటా ఈకార్య‌క్ర‌మాన్ని వీక్షించేందుకు ఇత‌ర జిల్లాల నుంచి కూడా భ‌క్తులు సికింద్రాబాద్‌కు క్యూ క‌డుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. మాతంగి భ‌విష్య వాణికి కూడా ప్రాధాన్యం ఉంది.