క్రికెట్ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. కొత్తగా ప్రకటించిన టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఈ దాయాదుల మధ్య ఒకే వరల్డ్ కప్‌లో ఏకంగా మూడు మ్యాచ్‌లు జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ కొత్త పద్ధతి వల్ల చిన్న జట్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ మెగా టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొంటాయని ఐసీసీ అధికారికంగా చెప్పింది. కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ర్యాంకింగ్స్‌లో అట్టడుగున ఉన్న మూడు జట్లు ముందుగా సూపర్ సిరీస్ ఆడాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన ఒక్క టీమ్ మాత్రమే మెయిన్ టోర్నీకి వెళ్తుంది. అంటే మిగతా రెండు జట్లు అసలు ప్రధాన టోర్నీ మొదలవ్వకముందే ఎలిమినేట్ అయిపోతాయన్నమాట.
ఆ సూపర్ సిరీస్ నుంచి వచ్చిన ఒక్క జట్టుతో కలిపి మొత్తం 12 టీమ్స్‌ను రెండు గ్రూపులుగా విడదీస్తారు. ఒక్కో గ్రూపులో ఆరు జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో తలబడతాయి. సాధారణంగా ఐసీసీ టోర్నీలలో ఇండియా, పాకిస్తాన్ ఎప్పుడూ ఒకే గ్రూపులో ఉంటాయి కాబట్టి, ఇక్కడే ఈ రెండు జట్ల మధ్య తొలి పోరు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
గ్రూప్ దశలో ప్రతి గ్రూప్ నుంచి టాప్ 3 జట్లతో పాటు, నాలుగో ప్లేస్‌లో ఉండి మెరుగైన రికార్డు ఉన్న మరో జట్టును ఎంపిక చేస్తారు. ఇలా మొత్తం ఏడు జట్లతో సూపర్ 7 రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మళ్లీ ప్రతి జట్టు మిగతా ఆరు జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఇండియా, పాక్ రెండు జట్లు ఈ రౌండ్‌కు చేరుకుంటే అభిమానులకు రెండో మ్యాచ్ చూసే అదృష్టం దక్కుతుంది.
ఆ తర్వాత సూపర్ 7 పాయింట్ల పట్టికలో టాప్ 4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. పాయింట్ల పట్టికలో ఆయా జట్లు నిలిచే స్థానాలను బట్టి సెమీస్ లో లేదా నేరుగా ఫైనల్ లో ఈ రెండు దేశాలు ముచ్చటగా మూడోసారి తలపడే ఛాన్స్ ఉంటుంది. ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా ఉండాలనే సాకుతో ఐసీసీ ఇలాంటి ఫార్మాట్ తెచ్చినా, అసలు ఉద్దేశం మాత్రం కాసుల వర్షం కురిపించే మ్యాచ్‌లే అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates