భూకంపంతో వణికిన వెనిజులా… మృతులు లక్షమంది!

వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్‌తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత 7.2 తీవ్రతతో, ఆ వెంటనే 39 సెకన్ల వ్యవధిలో మరో 7.5 తీవ్రతతో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంప కేంద్రం కరాకస్‌కు పశ్చిమాన ఉన్న మోరాన్ ప్రాంత సమీపంలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

భీకర ప్రకంపనల ధాటికి కరాకస్‌లో పలు బహుళ అంతస్తుల భవనాలు, నివాస గృహాలు కూలిపోయాయి. విద్యుత్, సమాచార సేవలకు అంతరాయం ఏర్పడగా, అనేక ప్రాంతాలు చీకట్లో మునిగిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

భూకంపాల కారణంగా ఇప్పటివరకు పలువురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారి సంఖ్య వందల్లో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా భూగర్భ సర్వే సంస్థ అంచనాల ప్రకారం మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పరిస్థితిని అత్యవసరంగా పరిగణించిన వెనిజులా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ సహాయ బృందాలను రంగంలోకి దింపింది. విమానాశ్రయాలు, రవాణా వ్యవస్థలపై కూడా ప్రభావం పడినట్లు సమాచారం.

జపాన్‌లోనూ భారీ భూకంపం

మరోవైపు జపాన్ ఉత్తర ప్రాంతంలోని ఇవతే తీరంలో గురువారం ఉదయం 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూప్రకంపనలు బలంగా నమోదైనప్పటికీ సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తినష్టం జరగలేదని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వెనిజులా, జపాన్‌లలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వెనిజులాలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.