ఇండియాలో పౌరసత్వానికి అసలైన ఆధారమేది?

విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్‌పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఒక వివరణ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పాస్‌పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసమే తప్ప, అది భారతదేశ పౌరసత్వానికి అసలైన ఆధారమేమీ కాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో సాధారణ జనాల్లో ఒకే ఒక్క ప్రశ్న మొదలైంది. ప్రభుత్వమే ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చే పాస్‌పోర్టే పౌరసత్వ నిరూపణకు సరిపోకపోతే, అసలు మన దేశంలో పౌరుడిగా నిరూపించుకోవడానికి ఏ డాక్యుమెంట్ పనికొస్తుంది?

మన దగ్గర ఉన్న ఓటరు ఐడీ, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ లాంటివి కూడా పౌరసత్వాన్ని పూర్తిగా నిరూపించలేవు. ఓటరు కార్డు కేవలం మనం ఓటు వేయడానికి అర్హులమని మాత్రమే చెబుతుంది. అలాగే ఆదాయపు పన్ను కోసం పాన్ కార్డ్, సంక్షేమ పథకాల కోసం రేషన్ కార్డ్ ఇస్తారు. మన దేశంలో నివసించే సాధారణ నివాసితులందరికీ ఇచ్చే ఆధార్ కార్డ్ కూడా పౌరసత్వానికి ఆధారం కాదని చట్టంలోనే స్పష్టంగా ఉంది. గతంలో కేంద్ర హోం శాఖ కూడా పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. వీటిలో ఏ ఒక్క పత్రాన్ని కూడా పౌరసత్వానికి తుది ఆధారంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది.

భారతదేశంలో పౌరసత్వం అనేది రాజ్యాంగం, పౌరసత్వ చట్టం 1955 ప్రకారం లభిస్తుంది. ఒక వ్యక్తి పుట్టుక, వంశపారంపర్యం, రిజిస్ట్రేషన్ లేదా దేశంలో విలీనమైన ప్రాంతాల ఆధారంగా పౌరుడిగా గుర్తింపు పొందుతాడు. ఇందులో రిజిస్ట్రేషన్ లేదా సహజసిద్ధంగా పౌరసత్వం పొందిన వారికి మాత్రమే ప్రత్యేకంగా పౌరసత్వ ధృవీకరణ పత్రం లభిస్తుంది. కానీ పుట్టుకతోనే ఇక్కడే పెరిగిన అత్యధిక శాతం మంది భారతీయులకు ఎలాంటి సింగిల్ అఫీషియల్ సిటిజన్‌షిప్ సర్టిఫికెట్ ఉండదు. అందువల్ల కోర్టులు సైతం ఏదో ఒక డాక్యుమెంట్‌ను కాకుండా అన్ని ఆధారాల సమూహాన్ని పరిశీలిస్తాయి.

చట్టప్రకారం తప్పుడు సమాచారంతో పాస్‌పోర్ట్ పొందినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా ప్రభుత్వం దాన్ని రద్దు చేసే అధికారం కలిగి ఉంటుంది. అందుకే పాస్‌పోర్ట్‌ను బలమైన ఆధారంగా చూస్తారే తప్ప తిరుగులేని పత్రంగా అంగీకరించరు. మన దేశంలో పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఒకే ఒక్క పక్కా డాక్యుమెంట్ అంటూ ఏదీ లేకపోవడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. బర్త్ సర్టిఫికెట్, స్కూల్ రికార్డులు, తల్లిదండ్రుల ఆధారాలు, నివాస ధృవీకరణలు వంటి అనేక పత్రాలు కలిస్తేనే అవి పౌరసత్వాన్ని నిర్ణయిస్తాయి. ఈ గందరగోళం వల్ల భవిష్యత్తులో సాధారణ పౌరులపై డాక్యుమెంట్లు సమర్పించాల్సిన భారం మరింత పెరిగే అవకాశం ఉంది.