రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్. అప్పుడే కాదు, ఇప్పటికీ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు అతనే. వేరే ఫ్రాంఛైజీలతో పోటీ పడి రికార్డు రేటుకు పంత్‌ను సొంతం చేసుకుని జట్టు పగ్గాలు అప్పగించిన ఎల్ఎస్‌జీ యాజమాన్యం.. దీని వల్ల ప్రయోజనం పొందకపోగా, మరింత నష్టపోయింది.
గత సీజన్లో ఏడో స్థానానికి పరిమితమైన ఆ జట్టు.. ఈ సీజన్లో మరీ దారుణంగా అట్టడుగ స్థానంలో నిలిచింది. దీంతో రిషబ్ పంత్ కెప్టెన్సీ నుంచి వైదొలగక తప్పలేదు. తనే స్వయంగా ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోగా.. అతడి నిర్ణయాన్ని ఎల్ఎస్‌జీ యాజమాన్యం వెంటనే అంగీకరించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం లక్నో యాజమాన్యం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఉన్నంత వరకు పంత్‌కు అంతా బాగానే సాగింది. అతడి సారథ్యంలో ఆ జట్టు మెరుగైన ప్రదర్శన కూడా చేసింది. కానీ కారణాలేంటో కానీ.. 2025 సీజన్‌కు ముందు డీసీని వదిలి వేలంలోకి వచ్చాడు పంత్. ఆ సమయంలో అతడి కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడి లక్నో అతణ్నిసొంతం చేసుకుంది. రికార్డు రేటుకు న్యాయం చేస్తూ జట్టును మెరుగైన స్థితిలో నిలుపుతాడని ఆశించింది యాజమాన్యం. 2022లో ఐపీఎల్‌లో అడుగు పెట్టి, వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరింది లక్నో.
2024లో రాహుల్ జట్టును సరిగా నడపలేకపోయాడని, అతణ్ని వదులుకుని పంత్‌కు కెప్టెన్సీ అప్పగిస్తే.. అతడి సారథ్యంలో జట్టు మరింత పతనం అయింది. గత సీజన్లోనూ ప్రదర్శన మారక ఏడో స్థానానికి పరిమితం అయిన జట్టు.. ఈసారి మరీ ఘోరంగా 14 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే నెగ్గి అట్టడుగున పదో స్థానానికి పరిమితమైంది. పంత్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఘోరంగా విఫలమయ్యాడు.
ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా గతంలో కేఎల్ రాహుల్ పట్ల వ్యవహరించిన తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. పంత్ మీద కూడా అతను తీవ్ర ఒత్తిడి తేవడం వల్లే అతను తడబడ్డాడనే వాదనా ఉంది. ఏదేమైనా ఐపీఎల్‌లో ఈ వైఫల్యం పంత్ అంతర్జాతీయ కెరీర్ మీదా ప్రభావం చూపేలా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates