గుండు కొట్టుకుంటే విజయ్ ప్రభుత్వం 15 వేలు ఇస్తుందని…

ఇప్పటి వరకు పుణ్యం వస్తుందని గుండు చేయించుకున్న వాళ్ళను చూసాం కానీ ఇప్పుడు పుణ్యం  15 వేల రూపాయల గిఫ్ట్ వస్తుందని ఆశ పడి గుండు చేయించుకున్న వాళ్ళను ఇప్పుడే చూస్తున్నాం. ఇది అత్యాశల కాలం. 100 రూపాయలు పెట్టుబడి పెడితే  10 వేల రూపాయలు వస్తాయని చెబితే విద్యావంతులు సైతం ఆశ పడి లక్షల రూపాయలు చెల్లించి చేతులు కాల్చుకుంటున్న రోజులు. ఇదే అత్యాశను అడ్డం పెట్టుకొని ఒక ఆకతాయి పలువురు మహిళలకు గుండు కొట్టించుకునేలా చేశాడు…ఇంతకూ ఏమి జరిగిందంటే…

గుండు కొట్టించుకుంటే నగదు బహుమతి….

తమిళనాడు లోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి కొందరు మహిళలకు మూడు రోజుల క్రితం ఒక అపరిచితుడి నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుతం కరోనా లాంటి మరో కొత్త వ్యాధి సోకుతుందని. ఈ వ్యాధి సోకకుండా విదేశాల్లో చాలా మంది మహిళలు గుండు చేయించుకుంటున్నారని చెప్పాడు. తమిళనాడులో  ఈ వ్యాధి సోకాకుండా గుండు చేయించుకున్న మహిళలకు విజయ్ ప్రభుత్వం మహిళలకు రూ. 15 వేలు, కాలేజీ విద్యార్థినులకైతే రూ. 45 వేలు, ఒక ల్యాప్ టాప్, పురుషులకైతే రూ. 6 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు నమ్మించాడు.

పరిమిత సంఖ్యలో టోకెన్లు ఉన్నాయని, వెంటనే పుదుకొత్తంబాడి మహిళలు గుండు చేయించుకొని కార్యాలయం వద్దకు వచ్చి డబ్బులు తీసుకొని పోవాలని నమ్మించాడు. అంతే… ఈ ఫోన్ కాల్ ను గుడ్డిగా నమ్మిన చిత్ర, రమయి, కావేరి అనే మహిళలు దగ్గరలో వున్న సెలూన్ కు వెళ్లి గుండు చేయించుకున్నారు. తర్వాత ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని రావడంతో మోసపోయామని గ్రహించారు.  ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి రాష్ట్రం మొత్తం వ్యాపించింది. 

పుకార్లు నమ్మొద్దు…

గుండు స్కీంతో ఉలిక్కిపడిన విజయ్ ప్రభుత్వం వెంటనే అధికారులను అప్రమత్తం చేసింది. సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని, అపరిచిత వ్యక్తులు నేరుగా ఫోన్లు చేస్తే నమ్మి మోసపోవద్దని ప్రకటించింది. ఇలాంటి ఫోన్లు వచ్చిన వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించింది.