ఔను… ఇది నిజమే. విద్యార్థులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం.. ఇటీవల జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విడుదల చేసిన నివేదిక. ఇంతకూ ఆ నివేదికలో ఏముందంటే…
7 వేల మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్…
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్వహించిన పరీక్షల్లో 7 వేల మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం తల పట్టుకుంటుంది. 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్లలోపు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా విస్మయపరిచే ఈ నిజం బయట పడింది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుండటంతో ఇది మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం….
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాజా నివేదికతో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా ప్రతి కళాశాలలో హెచ్ఐవీ, ఎయిడ్స్ కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా వ్యాధులపై అవగాహనా కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కళాశాలల్లో నిపుణులతో క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ నిర్వాహించనున్నారు.
పర్యవేక్షణ లోపమే కారణమా…
దేశానికి అత్యంత విలువైన సంపద వంటి యువకులు విచక్షణ కోల్పోయి హెచ్ఐవీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటం ఆందోళన కలిగించే అంశంగా పరిగణిస్తున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విద్యార్థులు నగరాలు, మెట్రో సిటీలకు వెళుతున్నారు. ఇక్కడ తల్లీదండ్రుల పర్యవేక్షణ ఉండటం లేదు. దాంతో మితి మీరిన స్వేచ్ఛ లభిస్తుంది.
ఇంటికి దూరంగా ఒంటరిగా ఉంటున్న యువకులు దారి తప్పుతున్నారన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. మెట్రో సిటీల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో కో లివింగ్ పీజీ లు రావడంతో విచ్చలవిడి జీవితాలను అనుభవిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఫారిన్ కల్చర్ ప్రభావం దీన్ని మరింతగా రాజేస్తుంది. దాంతో చాపకింద నీరులా హెచ్ఐవీ ప్రబలుతుందని కొందరు వైద్యులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
