తెలంగాణ రైతులతోపాటు.. ప్రభుత్వం కూడా మురిసిపోయేలా సుప్రీం కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఒకటి కాదు.. రెండుకాదు.. ఏకంగా మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఇచ్చిన ఈ తీర్పుతో తెలంగాణ జలవనరుల ముఖ చిత్రం సమూలంగా మారనుంది. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఆయా కేసులకు బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ముగింపు పలికింది. దీంతో రాష్ట్రంలో జలవనరులకు ఇక ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
తల్లి గర్భం నుంచి శిశువు …
రాజకీయంగా ఇటీవల కాలంలో తీవ్రస్థాయిలో చర్చకు వచ్చిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా.. సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు, గౌరవెల్లి ప్రాజెక్టులకు సంబంధించి ముడిపడిన అన్నికేసులను సుప్రీంకోర్టు తేల్చేసింది. ముఖ్యంగా పర్యావరణ అనుకూలత విషయంపై 2020 నుంచి ఈ కేసులు సుప్రీంకోర్టులో మూలుగుతున్నాయి. తాజాగా వీటిని పరిష్కరిం చిన ధర్మాసనం.. “పర్యావరణ అనుమతుల పేరుతో ప్రాజెక్టులను అడ్డుకోవడం.. తల్లి గర్భం నుంచి శిశువు బయటకు రాకుండా అడ్డుకోవడమే“-అని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రాజెక్టులతో పర్యావరణానికి ముప్పువాటిల్లిన సందర్భాల్లో వాటిని పక్కాగా నిరూపించే వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడింది.
తాజా కేసుల్లో రాజకీయ లబ్ధి.. ఆశ్రిత పక్షపాతం వంటివి పొడచూపుతున్నాయని దుయ్యబట్టింది. కోట్లాదిమందికి అన్నం పెట్టే ప్రాజెక్టులను అడ్డుకునే వారి వెనుక అతీంద్రియ శక్తులు ఉన్నాయని అభిప్రాయపడిన ధర్మాసనం.. అన్ని అనుమతులు చెల్లుతాయని పేర్కొంది. ఈ సమయంలో 2021 నాటి కేంద్ర పర్యావరణ శాఖ కార్యనిర్వాహక మెమోరాండంను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే, గతంలో ఇదే మెమోరాండం ఆధారంగా మంజూరైన పర్యావరణ అనుమతులను అనుమతిస్తున్నట్టు పేర్కొంది.
ఇప్పటికే అనుమతులు పొందిన ప్రాజెక్టులతో పాటు.. భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు కూడా తాజా తీర్పు వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న న్యాయవాదుల అభ్యర్థనను తోసిపుచ్చింది. “ఇది విధానపరైమన నిర్ణయం. సొమ్ములు కావాలి. వారి స్వేచ్ఛ వారికి ఉండాలి(ప్రభుత్వం). దీనిని మేం ఆదేశించలేం“ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక, తాజా తీర్పుతో ఆ మూడు ప్రాజెక్టుల పరిధిలోని ప్రాంతాల్లో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీర్పు కారణంగా ఇప్పటికే నిలిచిపోయిన రిజర్వాయర్లు, కెనాల్స్ పనులు త్వరగా పూర్తికానున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ ప్రాజెక్టులు
పాలమూరు-రంగారెడ్డి: తెలంగాణలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద కృష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోసి, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చడం దీని ముఖ్య ఉద్దేశ్యం. రూ.35,700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మాణం జరుగుతోంది. పర్యావరణ అనుమతులపై కేసులను తాజాగా సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
సీతమ్మ సాగర్: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం (అమ్మగారిపల్లి) వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బహుళార్ధక సాధక బ్యారేజీ. ఇది భద్రాచలానికి సమీపంలో ఉంది. దీని ప్రధాన లక్ష్యాలు.. సాగునీరు అందించడం, జలవిద్యుత్ ఉత్పత్తి చేయడం.
గౌరివెల్లి: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించడానికి నిర్మిస్తున్న ఒక ముఖ్యమైన రిజర్వాయర్. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం దీని ప్రధాన లక్ష్యంగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
