ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో పడేది ఆరోజే. దక్షిణ ఆసియాలోని అన్ని దేశాల్లో దాదాపు ఇదే విధానం అమలవుతోంది. అయితే కొంచెం వినూత్నంగా ఆలోచించిన నేపాల్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులో కీలక మార్పు చేపట్టినట్లు సమాచారం..
ఇప్పటివరకు అమలులో ఉన్న నెలవారీ జీతాల విధానాన్ని రద్దు చేస్తూ, ప్రతి 15 రోజులకు ఒకసారి జీతం చెల్లించే ‘ఫోర్ట్‌నైట్‌లీ పే సిస్టమ్’ను ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిసింది. దక్షిణాసియాలో ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా నేపాల్ నిలిచింది.
ఈ విధానం ప్రకారం ఉద్యోగుల నెల జీతాన్ని రెండు సమాన భాగాలుగా విభజించి, ప్రతి 15 రోజులకు ఒకసారి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఉద్యోగుల చేతిలో డబ్బు నిరంతరం ఉండేలా చేయడమే ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ కొత్త విధానం సివిల్ సర్వెంట్లు, నేపాల్ సైన్యం, పోలీసు బలగాలకు వర్తిస్తోంది. తరువాతి దశలో ఇతర ప్రభుత్వ రంగాలకు విస్తరించే అవకాశముంది.
ఉద్యోగుల ఆర్థిక అవసరాలు సకాలంలో తీర్చడం, మార్కెట్‌లో నగదు ప్రవాహాన్ని పెంచడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు తెలిపారు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం ఉద్యోగులకు నెలలోనే రెండు సార్లు ఆదాయం అందించేలా చేయడంతో వ్యక్తిగత ఆర్థిక నిర్వహణకు తోడ్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates