సైబర్ బందిపోట్లకు చెక్ పెట్టేలా ఆర్బీఐ ప్లాన్

ఎంతలా ప్రచారం చేసినా.. సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు ఎంతలా ప్రయత్నించినా.. నిత్యం కొన్ని వేల మంది మోసపోతున్న పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదులు..కేసుల వరకు వెళ్లని కేసులెన్నో. అదే సమయంలో కేసుల వరకు వెళ్లినా.. ఏళ్లకు ఏళ్లు కష్టపడి సంపాదించిన సంపదను అడ్డంగా దోచేస్తున్న సైబర్ బందిపోట్లకు చెక్ పెట్టేలా భారత రిజర్వు బ్యాంక్ తాజాగా ఐదు కీలక ప్రతిపాదనలు చేసింది.

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు అంతకంతకూ పెరగటమే కాదు.. భారీగా మోసపోతున్న వారు పెరుగుతున్నారు. ఆందోళన కలిగించే అంశం.. పెద్ద వయస్కుల వారు తమ జీవితకాలంలో సంపాదించిన మొత్తాన్ని ఇట్టే పోగొట్టుకుంటుూ లబోదిబోమంటున్న పరిస్థితి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆర్ బీఐ చేసిన తాజా ప్రతిపాదనలు పక్కాగా అమలు అయితే.. సైబర్ బందిపోట్లకు చెక్ పెట్టేందుకు సాధ్యమవుతుందన్న మాట వినిపిస్తోంది.

అంతకంతకూ పెరుగుతున్న డిజిటల్ మోసాలకు చెక్ పెట్టేందుకు వీలుగా రిజర్వు బ్యాంక్ కొత్త ప్రతిపాదనల్ని తీసుకొచ్చింది. తాము తెచ్చిన అంశాలపై అభిప్రాయ సేకరణ చేపట్టి.. అనంతరం అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఆర్ బీఐ తాజాగా ప్రతిపాదించిన ఐదు అంశాల్ని చూస్తే..

1.  కొత్తగా ఎవరికైనా రూ.10వేలకు మించి చెల్లింపులు చేయాల్సి వస్తే ఆ సొమ్ము అవతలి వారికి చేరటానికి గంట సమయం పడుతుంది. ఈ లోపు డబ్బులు పంపిన వారికి ఏదైనా అనుమానం వస్తే.. ఆ లావాదేవీని రద్దు చేసుకోవచ్చు.

2.  తన ఖాతాలో ఏదైనా అనుమానాస్పద అనధికార లావాదేవీ జరిగిందని ఖాతాదారుడు భావిస్తే.. వెంటనే అన్ని రకాల డిజిటల్ చెల్లింపులను ఒక్క క్లిక్ తో నిలిపేలా కొత్తగా ‘కిల్ స్విచ్’ అప్షన్ ఉంటుంది. దీంతో.. యూపీఐ.. ఆన్ లైన్ బ్యాంకింగ్. కార్డు లావాదేవీలన్నీ నిలిచిపోతాయి

3. 70 ఏళ్లకు పైబడినవారు.. దివ్యాంగులు రూ.50 వేలకు పైబడి లావాదేవీలు చేసేటప్పుడు వారు ముందుగా తాము నామినేట్ చేసిన వ్యక్తి ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది. వారు ఆమోదిస్తేనే.. అవతలివారికి ఫండ్స్ క్రెడిట్ అవుతాయి.

4. సైబర్ నేరగాళ్లు తమ ఆచూకీ పోలీసులకు అందకుండా ఉండేందుకు మ్యూల్ ఖాతాలను వినియోగిస్తుంటారు. అలాంటి వాటికి చెక్ పెట్టి మోసపూరిత ఖాతాలను గుర్తించేందుకు.. సరైన ధ్రువీకరణ లేని ఖాతాల్లో వార్షిక క్రెడిట్ పరిమితి రూ.25 లక్షలకు పరిమితం చేయటం.

5. కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతాలకు యూపీఐ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి ఫీచర్లను డిఫాల్ట్ గా నిలిపివేయటం.
ఈ సూచనలు బాగున్నప్పటికీ.. వేర్వేరు సందర్భాల్లో ఇలాంటివి కొత్త ఇబ్బందులకు కారణమవుతాయి.

అయితే.. సైబర్ బందిపోట్లకు చెక్ పెట్టేందుకు కొన్ని మార్గదర్శకాల్ని.. కొత్త నిబంధనల్ని అమల్లోకి తేవాల్సి ఉంటుంది. ఇందుకు పెద్ద ఎత్తు.. సలహాలు.. సూచనలు తీసుకొని అమల్లోకి తెస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతో ఇంతో మార్పు రావటం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి.