ఈ రోజుల్లో సినిమాల్లో సందేశాలు ఇస్తే..ఎవరు తీసుకుంటారు? మంచి చూపిస్తే ఎవరు నేర్చుకుంటారు అనే చర్చ తరచుగా జరుగుతుంటుంది. అలాంటి సినిమాలకు ఆదరణ కూడా తక్కువగానే ఉంటుంది. కానీ సినిమాల్లో చూపించే చెడు తాలూకు ప్రభావం మాత్రం జనాల మీద చాలానే ఉంటుందని ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉంటుంది. గత ఏడాది తెలుగులో సంచలన విజయం అందుకున్న చిత్రాల్లో రాజు వెడ్స్ రాంబాయి ఒకటి. అందులో చూపించిన ఒక చెడు అంశం ( నిజంగానే జరిగిన ఘటన ).. ప్రేక్షకులను గగుర్పాటుకు గురి చేసింది.
తనకు ఇష్టం లేని కుర్రాడితో ప్రేమలో పడిందని హీరోయిన్‌కు హెచ్ఐవీ ఇంజక్షన్ చేసి ఆమెతో పాటు తన ప్రేమికుడి జీవితాన్నీ నాశనం చేస్తాడు ఆమె అన్న. ఆ సన్నివేశం చూసి ప్రేక్షకులు కదిలిపోయారు. అది నిజంగా ఒక గ్రామంలో జరిగిన ఘటనే కావడం గమనార్హం. ఈ సినిమా ద్వారా ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు దర్శకుడు సాయిలు. ఐతే ఈ సినిమా జనాలను మంచి దిశగా ఎంత మార్చిందో కానీ.. అందులో చూపించిన చెడు విషయం నుంచి స్ఫూర్తి పొందే వాళ్లు ఎక్కువైపోతున్నారు.
రాజు వెడ్స్ రాంబాయి విడుదల తర్వాత ఇప్పటికే ఇలాంటి ఘటలను కొన్ని వార్తల్లోకి రావడం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఉదంతంలో ఒక ప్రాణం పోయింది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గత నెల మనోహర్ అనే వ్యక్తి.. దారుణానికి ఒడిగట్టాడు. తనతో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువతి హెచ్ఐవీ కలిసిన రక్తాన్ని ఎక్కించడం సంచలనం రేపింది. బాధిత యువతి ఈ పరిణామంతో తీవ్ర మనోవేదనకు గురై.. ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
తనకు జరిగిన ఘోరం విషయంలో ఇన్నాళ్లూ ఓర్చుకున్న ఆ యువతి.. భవిష్యత్తును తలుచుకుని కుమిలిపోతూ చివరికి ప్రాణమే తీసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా కుమిలిపోతూ.. బాధ్యుడైన మనోహర్‌కు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నాడు. మరి అతడికి ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates