మరో రెండు నెలల్లో భారత నావికుడి పెళ్లి.. ఈలోపే…

రష్యా సాయుధ బలగాలు జరిపిన దాడిలో కేరళకు చెందిన అఖిల్ జోయన్ అనే 26 ఏళ్ల నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉక్రెయిన్‌లోని ఒడెస్సా తీరానికి సమీపంలో వెళ్తున్న ‘ఎమ్‌వి గోల్డెన్ లియో’ అనే సరుకు రవాణా నౌకపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో అఖిల్‌తో పాటు మరో ముగ్గురు భారతీయులు, ఐదుగురు సిరియా నావికులు సహా మొత్తం 10 మంది సిబ్బంది మరణించినట్లు సమాచారం.

కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా వెళ్లరిక్కుండు గ్రామానికి చెందిన అఖిల్, గత 6 ఏళ్లుగా ఆ నౌకలోనే నావికుడిగా పనిచేస్తున్నాడు. విద్యుత్ షాపులో పనిచేసే తండ్రి, ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఉన్న తల్లికి ఇతను ఒక్కడే కుమారుడు. కుటుంబానికి ఆసరాగా ఉంటూ ఇటీవల కొత్త ఇల్లు కూడా నిర్మించుకున్నాడు. మరికొద్ది రోజుల్లో మెరుగైన భవిష్యత్తు కోసం ఉద్యోగం కూడా మారాలని ప్లాన్ చేసుకున్నాడు.

అఖిల్‌కి మూడు నెలల క్రితమే అలప్పుజ జిల్లాకు చెందిన ఒక యువతితో నిశ్చితార్థం జరిగింది. మరో రెండు నెలల్లో వివాహం జరగాల్సి ఉంది. ఎంగేజ్‌మెంట్ కోసం ఊరికి వచ్చిన అఖిల్, నెల రోజుల క్రితమే తిరిగి విధుల్లో చేరాడు. లోకల్‌గా టగ్ ఆఫ్ వార్ ప్లేయర్‌గా మంచి పేరున్న ఇతను, అందరితో ఎంతో క్రమశిక్షణగా ఉండేవాడని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.

సోమవారం సాయంత్రం షిప్పింగ్ కంపెనీ పంపిన ఇమెయిల్ ద్వారా అఖిల్ మరణ వార్త కుటుంబ సభ్యులకు తెలిసింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియా-బిస్సావు పతాకంతో ఉక్రెయిన్ మొక్కజొన్నను తీసుకెళ్తున్న ఈ నౌకపై ఒడెస్సా పోర్టు నుంచి బయలుదేరిన వెంటనే దాడి జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నుండి మరో 8 మందిని సురక్షితంగా రక్షించారు.

అఖిల్ భౌతికకాయాన్ని స్వదేశానికి రప్పించేందుకు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం చర్యలు చేపట్టింది. విదేశాంగ శాఖ, రష్యన్ కాన్సులేట్‌తో సమన్వయం చేసుకోవాలని నోర్కా (NORKA) రంగాన్ని ఆదేశించింది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కుటుంబానికి అండగా ఉంటూ పార్థివ దేహాన్ని త్వరగా తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.