వదలా అంటే ప్రేక్షకులు వదిలేశారు

లెజెండ్ నుంచి జగపతిబాబు విలన్ గా మెప్పించడం మొదలయ్యాక ఆయనతో సోలో హీరోగా సినిమాలు తీసేందుకు నిర్మాతలు రిస్క్ చేయలేదు. అందులోనూ మార్కెట్ పరంగా చాలా క్యాలికులేటెడ్ గా ఉండే జగ్గు భాయ్ ఏ దశలోనూ తనకో గొప్ప ఇమేజ్ ఉంది, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేయకూడదనే నియమం పెట్టుకోలేదు. అయినా సరే జగపతిబాబుని కథానాయకుడిగా పెట్టి నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒక రిస్క్ చేశారు. అదే వదలా. మొన్న మంచి పోటీ మధ్య జూలై 17 విడుదలయ్యింది.

ఆ మధ్య ఆబ్సెషన్ చూశాంగా. కొంచెం దాని పోలికల్లోనే ఈ వదలా ఉంటుంది. ఇరవై సంవత్సరాల వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న యోగి అనే డాక్టర్ జేవితంలోకి ఆముద వస్తుంది. ఎందుకంటే తనకు గతంలో యాక్సిడెంట్ అయినప్పుడు కాపాడింది యోగినే కాబట్టి. స్నేహితురాలిగా ప్రవేశించి, క్రమంగా సైకోగా మారి, క్రైమ్స్ చేసే దాకా వెళ్తుంది. అసలు ఏజ్ బార్ అయిన యోగి మీద ఆ అమ్మాయి ఎందుకు అంతగా మనసుపడింది, చివరికి ఏమయ్యిందనేది స్టోరీ.

జెన్ జీ ఆడియన్స్ ని మెప్పించాలంటే ఆషామాషీ కాదు. సాలిడ్ కంటెంట్, టైట్ స్క్రీన్ ప్లే, మంచి మ్యూజిక్ ఉంటేనే థియేటర్లలో జనాలు కనిపిస్తారు. లేదంటే రిలీజ్ రోజు మార్నింగ్ షోకే సింగల్ డిజిట్లు కనిపిస్తాయి ‘వదలా’లాగా. సైకో క్రైమ్ థ్రిల్లర్ తో జనాన్ని ఆకట్టుకుందామని ప్రయత్నించిన దర్శకుడు ఆకెళ్ళ వి కృష్ణ ఇది ఓటిటి మూవీ కాదని మర్చిపోయారు కాబోలు. టేకాఫ్ నుంచి క్లైమాక్స్ దాకా ప్రతిదీ గతంలో చూసినట్టే అనిపించేలా, భరించలేని ప్రహసనంగా మార్చేసి బోర్ కొట్టించేస్తారు.

రెండు మూడు ట్విస్టులు పెట్టేస్తే పబ్లిక్ వావ్ అనుకునే రోజులు పోయాయి. ఎంత గ్రిప్పింగ్ గా రాసుకున్నా ముందేం జరుగుతుందో ఠక్కున చెప్పే బ్యాచులు ఎక్కువైపోయాయి. అలాంటిది ఇంత అవుట్ డేటెడ్ నెరేషన్ తో వెండితెరపై పాస్ అవ్వడం అంత సులభం కాదు. టైటిల్ కూడా వదలా అంటూ ఏదో అరుంధతి ఊతపదం పెట్టుకున్నారు కానీ అది కూడా మైనస్సే అయ్యింది. మొత్తానికి పేరుకు తగ్గట్టే టీమ్ వదలా అంటే జనాలు మాకెందుకులే అని వదిలేశారు కాబోలు.