ఎంతైనా భారతీయ ప్రేక్షకులకు ఉన్నంత సినిమా ప్రేమ ప్రపంచంలో మరెవరికి లేదు. ఎందుకంటే భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు ఎక్కడి నుంచి వచ్చిందనేది పట్టించుకోకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. ది ఒడిస్సి అదే ఋజువు చేస్తోంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా వైడ్ మూడు రోజులకు కలిపి సుమారు 73 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. మన దేశంలో దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ ఫిల్మోగ్రఫీకి ఇదే అత్యధిక ఓపెనింగ్ నెంబర్.
నిన్న ఒక్క రోజే సుమారు 9 వేలకు పైగా షోలు ఒక్క భారతదేశంలోనే పడ్డాయంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టాక్ మిశ్రమంగా ఉన్నా ఖచ్చితంగా దీన్ని థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయాలని ఫిక్స్ అయిన ప్రేక్షకులు ఇంకేం ఆలోచించకుండా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. తెలుగు వెర్షన్ సైతం బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. సబ్ టైటిల్స్ అవసరం లేకుండా చక్కగా అర్థం చేసుకునేలా క్వాలిటీ మైంటైన్ చేయడంతో అనువాదం గురించి కంప్లయింట్స్ లేవు.
ఇవాళ సోమవారం వర్కింగ్ డే రోజు సైతం గంటకు 4 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చూస్తుంటే నోలన్ మాస్ అంత ఈజీగా నెమ్మదించేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఐమాక్స్, ప్రీమియం స్క్రీన్ల టికెట్లకు భీభత్సమైన డిమాండ్ ఉంది. హైదరాబాద్ పీసీఎక్స్, అల్లు సినిమాస్, ఏఎంబిలో ఎవరైనా తెలిసినవాళ్ళు ఉంటే తప్ప మంచి సీట్లో టికెట్ దొరకడం కష్టమైపోయింది. ఎక్కడో సూళ్లూరుపేటలో ఉండే ఎపిక్ స్క్రీన్ చాన్నాళ్ల తర్వాత ఫుల్ అవుతోంది.
ఇంటర్ స్టెల్లార్ లాగా ది ఒడిస్సికి యునానిమస్ టాక్ సోషల్ మీడియాలో లేకపోవడం కొంత ప్రభావం చూపించేలా ఉంది. గ్రీకు వీరుడి సాహస ప్రయాణాన్ని అద్భుతంగా చూపించిన క్రిస్టోఫర్ నోలన్ ఎమోషన్స్ పరంగా చూపించిన డెప్త్ యాక్షన్ ఎపిసోడ్స్ లోనూ పెంచాల్సిందనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఇదో క్లాసిక్ అంటున్న వాళ్ళు, ఇదెక్కడి బోరింగ్ సినిమారా బాబు అంటున్న వాళ్ళు అందరూ ది ఒడిస్సి గురించే మాట్లాడుకోవడం అసలు ట్విస్టు.
Gulte Telugu Telugu Political and Movie News Updates