మగతనం లేదన్న భార్య… భర్త ఆత్మహత్య

పెళ్లి చేసుకున్నాక అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఉదంతాలను ఇటీవల బోలెడు చూశాం. అలాగే ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక కాబోయే భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన అమ్మాయి కథా ఇటీవల చర్చనీయాంశం అయింది. ఇప్పుడు తెలుగు గడ్డ మీద ఇంకో దారుణ ఘటన జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి.. భర్తకు మగతనం లేదని అవమానించడంతో ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది.

మూడు నెలల కిందటే పెళ్లి చేసుకున్న సదర్ లాల్ అనే 27 ఏళ్ల యువకుడు భార్య అవమానాలకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లయిన మూడో రోజు నుంచే నీకు మగతనం లేదంటూ సదర్ లాల్‌ను భార్య అవమానించేదదట. ఇటీవల సీత్లా పండుగ సందర్భంగా అత్తారింటికి భార్యతో కలిసి సదర్ వెళ్లగా.. అక్కడ గొడవ జరిగిందట. కుటుంబ సభ్యులతో కలిసి మరోసారి భార్య అవమానించిందట. నీకు మగతనం లేదని అందరి ముందు అనడంతో అతను తట్టుకోలేకపోయాడు.

తీవ్ర మనస్తాపంతో తన అక్క దగ్గరికి వెళ్తున్నట్లు బావకు మెసేజ్ పెట్టిన సదర్.. అక్కడ కలుపుమందు తాగి ప్రాణం తీసుకున్నాడు. వెంకటనాయపాలెం కాలువ దగ్గర అతడి మృతదేహాన్ని పోలీసులు బయటికి తీశారు. పెళ్లికి ముందే ఆ యువతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని.. ఇష్టం లేని పెళ్లి చేయడంతో భర్త మీద నింద మోపి విడిపోయేందుకే ఇలా చేసిందని.. సదర్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సదర్‌కు మగతనం లేదని పంచాయితీ పెడితే.. అతడికి మెడికల్ టెస్టులు కూడా చేయించామని, అలాంటిదేమీ లేదని.. భార్య తనపై అభాండాలు వేయడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని వారంటున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.