బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తెచ్చుకుని తొలి మూడు రోజులకే సూపర్ హిట్ ముద్ర వేయించేసుకున్న లెనిన్ తర్వాత వీక్ డేస్ లో నెమ్మదించింది. అరవై కోట్ల మార్కు దాటగానే స్లో అయిపోవడం అభిమానులను టెన్షన్ పెట్టిన మాట వాస్తవం. కాకపోతే మరీ తీసికట్టుగా ఆక్యుపెన్సీలు పడిపోలేదు. టీమ్ ఇది దృష్టిలో పెట్టుకునే నాగార్జున అతిథిగా సక్సెస్ మీట్ చేయడంతో పాటు ఏదో ఒక రూపంలో ప్రమోషన్లు యాక్టివ్ ఉండేలా చూసుకుంది. ఇప్పుడు రెండో వీకెండ్ వచ్చేసింది.
శని ఆదివారంలో లెనిన్ అనూహ్యమైన పికప్ చూపించింది. ఇవాళ గంటకు సగటున అయిదున్నర వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం పెద్ద విషయమే. బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ కి ది ఒడిస్సి తప్ప ఆప్షన్లు లేవు. పేరుకి మొన్న అయిదారు కొత్త సినిమాలు రిలీజయ్యాయి కానీ ఏ ఒక్కటి కనీస స్థాయిలో జనాన్ని మెప్పించలేదని కలెక్షన్లు చూస్తే అర్థమైపోతుంది. కొన్ని మరీ అన్యాయంగా మొదటి రోజే సెకండ్ షో టైంలో డెఫిషిట్లు చూపించాయి. పరిస్థితి అంత తీవ్రంగా ఉంది.
లెనిన్ కన్ను ప్రస్తుతం వంద కోట్ల మైలురాయి మీద ఉంది. నిర్మాత నాగవంశీ ఈ వీకెండ్ తో అది అవ్వాలనే నమ్మకంతో ఉన్నారు. కాకపోతే సిటీస్, మల్టీప్లెక్సుల్లో ఒడిస్సి ప్రభావం అయితే ఉంది. లెనిన్ నిన్నటి నుంచి అనూహ్యంగా బిసి సెంటర్స్ లో బాగా పికప్ నమోదు చేసింది. చాలా చోట్ల ఫుల్స్ కూడా పడ్డాయి. ఇవాళ గరిష్టంగా ఎంత రాబట్టుకుంటుందనే దాని మీద ఫైనల్ నెంబర్స్ ఆధారపడి ఉంటాయి. వచ్చే వారం సిచువేషన్ ఇప్పుడే అంచనా వేయలేం.
పబ్లిసిటీ పరంగా టీమ్ వైపు నుంచి చేయాల్సింది అంతా చేసింది. ఇక మిగిలింది జనాలు చూసుకోవడమే. నెక్స్ట్ వీక్ ‘చెన్నై లవ్ స్టోరీ’ ఉంది. దాని మీద మంచి బజ్ ఉంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే లెనిన్ కి ఇంకో ఛాన్స్ దొరకనట్టే. అయితే పెద్ది, లెనిన్ లాంటివి కొంచెం లాంగ్ రన్ లో వీక్ డేస్ లో కూడా స్టడీగా ఉంటే థియేటర్లు ఎక్కువ రోజులు కళకళలాడతాయి. మరి అఖిల్ పరుగు ఎక్కడిదాకా వెళ్తుందో ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో వేచి చూడాలి. ఫైనల్ స్టేటస్ డిసైడయ్యేది అప్పుడే.
Gulte Telugu Telugu Political and Movie News Updates