మొన్న శుక్రవారం విడుదలైన కొత్త సినిమాల్లో ‘ఓ సుకుమారి’ ఉంది. ట్రైలర్ బట్టి కాన్సెప్ట్ ఏదో వెరైటీగా ఉంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది. దర్శకుడు భరత్ దర్శన్ పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ గతంలో తన స్క్రిప్ట్ లోని సీన్లు మొన్న సంక్రాంతికి రిలీజైన ఒక చిత్రంలో వాడుకున్నారని చెప్పడం సోషల్ మీడియాలో వైరలయ్యింది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత హీరోయిన్ ఐశ్యర్య రాజేష్ ఒప్పుకున్న టాలీవుడ్ మూవీ ఇదే కావడం గమనార్హం.
బ్యాడ్ లక్ ఏంటంటే ఓ సుకుమార్ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. ది ఒడిస్సి ప్రభంజనం, లెనిన్ ఇంకా రెండో వారంలోనే ఉండటం లాంటి కారణాలు దీనికి అడ్డంకిగా మారాయి. హీరో తిరువీర్ ఇంతకు ముందు చేసిన పాపం ప్రతాప్ తరహాలోనే దీని మీద కూడా విపరీతమైన నమ్మకాన్ని పెట్టుకున్నాడు. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని నవ్విద్దామని చూసిన దర్శకుడు ఆ ప్రయత్నంలో పడిన తడబాటు వల్ల పాజిటివ్ టాక్ రాలేదు.
స్టోరీ లైన్ చూసుకుంటే ముట్టుకుంటే కరెంటు షాక్ కొట్టే విచిత్రమైన లక్షణమున్న ఒక అమ్మాయిని ఏరికోరి మరీ హీరో పెళ్లి చేసుకుంటాడు. కానీ అసలు ట్విస్ట్ అత్తారింటికి వచ్చాక బయట పడుతుంది. దీంతో వాళ్ళ కుటుంబానికో పెద్ద చిక్కొచ్చి చేరుతుంది. దీన్నుంచి ఎలా బయటపడ్డారు, భార్యకున్న సుకుమారమైన జబ్బుని మనోడు ఎలా పోగొట్టాడనేది మెయిన్ పాయింట్. చిన్నగా అనిపించే ఇలాంటి బ్యాక్ డ్రాప్ మీద రెండు గంటలు నడిపించారు.
జనాలను నవ్వించాలని సినిమా తీసినప్పుడు కామెడీ చాలా ఆర్గానిక్ గా ఉండాలి. అనిల్ రావిపూడి పాటించే సూత్రం ఇదే. కానీ ఓ సుకుమారి టీమ్ కేవలం ఫిల్లర్స్ మీద ఆధారపడి ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ ని బ్యాలన్స్ చేయలేకపోవడంతో భరించలేని ప్రహసనంగా మారిపోయింది. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ బండిని ఎంత లాగాలని చూసినా చక్రాలే లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. అందుకే మంచి కాంపిటీషన్ మధ్య బాక్సాఫీస్ వద్ద షాక్ కొట్టించుకోక తప్పలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates