“భార్య ఉన్నా.. వేరే మహిళతో సహజీవనం తప్పుకాదు. అయితే.. సహజీవనం చేసేందుకు పరస్పర అంగీకారం ఉంటే చాలు“ అని దేశంలో ప్రతిష్టాత్మక హైకోర్టుగా గుర్తింపు పొందిన అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ కేసులో సహజీవనం చేస్తున్న మహిళ తరఫు బంధువులను `సర్దుకుపోవాలని` తేల్చి చెప్పింది.
అంతేకాదు.. సహజీవనంలో ఉన్న వారికి(ఈ కేసులో) పోలీసులు పటిష్ఠ భద్రత కల్పించాలని ఆదేశించింది. వారిపై ఎలాంటి కేసు నమోదు చేయడానికి వీల్లేదని పేర్కొంది. “అతడి భార్య, సహజీవన భాగస్వామికి ఇబ్బంది లేనప్పుడు.. కోర్టులు కేవలం చట్ట ప్రకారం మాత్రమే పనిచేయగలవు“ అని న్యాయ మూర్తి వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. “మహిళ తల్లిదండ్రులుగా.. మీ ఆవేదనను కోర్టు అర్థం చేసుకుంటుంది. కానీ, మీది నైతికత మాత్రమే. చట్ట ప్రకారం సహజీవనం చేసే హక్కు వారికి ఉంది. సదరు మహిళ సైతం పోలీసుల ముందు తనకు ఇష్టమేనని వాంగ్మూలం ఇచ్చింది. దీనిని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి“ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సదరు మహిళ కుటుంబం సభ్యులు వేసిన పిటిషన్‌ను పాక్షికంగా రద్దు చేశారు. అయితే..ఇంకా వాదనలు వినిపించాల్సి ఉందన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని వచ్చే నెల వరకు వాయిదా వేశారు.
విషయం ఏంటి?
ఉత్తరప్రదేశ్‌లోని జైతీపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి వివాహమైంది. భార్యా భర్తలు అన్యోన్యంగాకాపురం చేస్తున్నారు. అయితే.. కొన్నాళ్ల కిందట పరిచయం అయిన మరో అవివాహితతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారి.. అనంతరం ఇరువురు పరస్పర అంగీకారంతో సహజీవనం ప్రారంభించారు. దీనిపై సదరు యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి.. తమ కుమార్తెకు వివాహ సంబంధాలు చూస్తున్నామని.. ఇంతలోనే తన మాయ మాటలతో ఆ వ్యక్తి లోబరుచుకున్నాడని.. తమ కుమార్తెను తమకు అప్పగించాలని విన్నవించారు.
దీనిపై కేసు నమోదు చేయగా.. సదరు యువతి.. హైకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా తన ఇష్టప్రకారమే సహజీవనం చేస్తున్నట్టు సదరు మహిళ పేర్కొంది. అంతేకాదు.. కుల ప్రాతిపదికన తమ కుటుంబం తన ప్రాణాలకు హాని తలపెట్టే ప్రయత్నం చేయొచ్చని తెలిపింది.
దీంతో సదరు సహజీవనాన్ని సమర్థించిన హైకోర్టు.. భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఇదిలావుంటే.. నైతికత ప్రకారం వీరి బంధం తప్పయినప్పటికీ.. కోర్టులకు నైతికతతో పనిలేదని.. కేవలం చట్టం ప్రకారమే నడుచుకుంటాయని న్యాయ మూర్తి వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates