అమెరికాలో ఉద్యోగం చేస్తూ, వీసా రెన్యూవల్ కోసం ఇండియా వచ్చిన వారికి పెద్ద షాక్ తగిలింది. డిసెంబర్ 15 తర్వాత జరగాల్సిన వేలాది హెచ్ 1బి వీసా ఇంటర్వ్యూలను అమెరికా అధికారులు ఉన్నపళంగా రద్దు చేశారు. ముందస్తు సమాచారం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతోమంది భారతీయ టెక్కీలు ఆందోళనలో పడ్డారు. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా తనిఖీలు, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ నిబంధనలను కఠినతరం చేయడమే అని తెలుస్తోంది.
ఇప్పుడు రద్దయిన ఇంటర్వ్యూలను మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. కొంతమందికి ఏకంగా 2026 అక్టోబర్ వరకు వాయిదా వేసినట్లు సమాచారం. పాత తేదీల ప్రకారం ఎవరూ కాన్సులేట్ ఆఫీసులకు రావొద్దని, ఒకవేళ వస్తే లోపలికి అనుమతించబోమని అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది. మీ కొత్త అపాయింట్‌మెంట్ తేదీలను మెయిల్ ద్వారా పంపిస్తామని, అప్పుడే రావాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించింది.
ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా నష్టపోయింది ఇప్పటికే ఇంటర్వ్యూల కోసం ఇండియాకు చేరుకున్న వారే. పని పూర్తయ్యాక తిరిగి వెళ్ళిపోవచ్చని ప్లాన్ చేసుకున్న వారు ఇప్పుడు ఇక్కడే చిక్కుకుపోయారు. చేతిలో వాలిడ్ వీసా లేకపోవడంతో వారు తిరిగి అమెరికా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అటు ఉద్యోగాలు ఏమవుతాయో తెలియక, ఇటు వీసా ఎప్పుడు వస్తుందో తెలియక వీరంతా తీవ్ర సందిగ్ధంలో పడ్డారు.
దీనిపై ఇమ్మిగ్రేషన్ లాయర్లు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీసా ప్రక్రియ అనేది ఒక అంతులేని గందరగోళంలా మారిపోయిందని ఎమిలీ న్యూమాన్ అనే లాయర్ విమర్శించారు. ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినం చేయడం వల్లే ఇలా జరుగుతోంది. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని, అందుకే ఇంత ఆలస్యం అవుతోందని సమాచారం.
అమెరికా జారీ చేసే హెచ్ 1బి వీసాల్లో దాదాపు 71 శాతం భారతీయులే ఉంటారు. కాబట్టి ఈ ప్రభావం మనవాళ్ళ మీదే ఎక్కువగా పడనుంది. దీనికి తోడు వీసా ఫీజు పెంపు నిర్ణయాలు కూడా టెక్కీలను కలవరపెడుతున్నాయి. టెక్ కంపెనీలు నైపుణ్యం ఉన్న ఉద్యోగులను నియమించుకోవడానికి ఈ వీసాలను వాడతాయి. కానీ తాజా నిబంధనలతో ఈ ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates