ఈనెల 25 నే కరోనా టీకా లాంచ్ అవుతోందా ?

యావత్ ప్రపంచం అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న కోవిడ్ 19 టీకా ఈనెల 25వ తేదీన ప్రదానమంత్రి నరేంద్రమోడి విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 25న మాజీ ప్రధానమంత్రి అతల్ బీహారీ వాజ్ పేయ్ జయంతి సందర్భంగా కోవిడ్ టీకా విడుదల చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే బ్రిటన్లో కోవిడ్ టీకా వేయటం మొదలైన విషయం అందరికీ తెలిసిందే. బ్రిటన్ ఫార్మా దిగ్గజ కంపెనీ ఫైజర్ డెవలప్ చేసిన కోవిడ్ టీకా ప్రస్తుతానికి బ్రిటన్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే తాము తయారు చేసిన టీకాను భారత్ లో కూడా ప్రవేశపెట్టేందుకు ఫైజర్ దరఖాస్తు చేసుకుంది.

ఈ నేపధ్యంలో భారతీయ కంపెనీలు భారత్ బయోటెక్, బయొలాజికల్ ఈ, సీరమ్ ఫార్మాకంపెనీలు తయారు చేస్తున్న టీకా తొందరలోనే ఇండియా అంతా లాంచ్ కాబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులు మంగళవారం ప్రకటించారు. డిసెంబర్ 25వ తేదీన లాంచ్ అవ్వబోయే టీకా భారత్ బయోటెక్, బయొలాజికల్ ఈ, సీరమ్ ఫార్మా కంపెనీల్లో ఏ కంపెనీ తయారీ అన్నది మాత్రం సస్పెన్సుగా ఉండిపోయింది.

సీరమ్ కంపెనీ, భారత్ బయోటెక్ కంపెనీలను ఈమధ్యే ప్రధానమంత్రి నరేంద్రమోడి సందర్శించిన విషయం తెలిసిందే. అలాగే బయోటెక్, బయొలాజికల్ ఈ కంపెనీలను బుధవారం 80 దేశాల రాయబారులు, హై కమీషనర్లు సందర్శించబోతున్నారు. ఇంతమంది ఒకేసారి ప్రముఖులు కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలను సందర్శిస్తున్నారంటే అందరిలోను ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది.

ఇదే సమయంలో వ్యాక్సిన్ కోసం కేంద్రప్రభుత్వం ‘కోవిన్’ అనే యాప్ ను రూపొందించింది. ఈ యాప్ లో పేర్లు నమోదు చేసుకున్న వారికే వ్యాక్సిన్ వేయాలని కూడా డిసైడ్ చేసింది. ఎందుకంటే వ్యాక్సిన్ వేయించుకున్న వారెవరు ? వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వారి పరిస్దితి ఎలాగుంది ? లాంటి ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకే యాప్ ను రూపొందించింది. వ్యాక్సిన్ వేయించుకున్న వారు తర్వాత అర్ధగంట సదరు కేంద్రంలోనే ఉండాల్సుంటుంది. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఏవైనా దుష్ఫలితాలు వస్తాయేమో పరిశీలించేందుకే కేంద్రం ఇటువంటి నిబంధన తెచ్చింది.

ప్రతి ఒక్క వ్యక్తి రెండు వ్యాక్సిన్లను వేయించుకోవాల్సుంటుంది. మొదటిసారి వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఏ కంపెనీ వ్యాక్సిన్ అయితే వేయించుకున్నారో రెండోసారి కూడా అదే కంపెనీ వ్యాక్సిన్ను వేయించుకోవాల్సుంటుంది. అప్పుడే వ్యాక్సిన్ పనితీరును అధ్యయనం చేయటానికి అవకాశం ఉంటుంది. రెండుసార్లు రెండు కంపెనీల వ్యాక్సిన్లు తీసుకుంటే పనితీరును అధ్యయనం చేయటం కష్టమైపోతుంది. మొత్తం మీద డిసెంబర్ 25వ తేదీన కరోనా వైరస్ టీకా విడుదలపై అందరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.