విమాన ప్రయాణికులకు పెద్ద షాక్ తగిలే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీలో ఒక ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ కారణంగా నిప్పంటుకోవడంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పవర్ బ్యాంక్‌లపై దేశవ్యాప్తంగా నిషేధం లేదా కఠిన నిబంధనలు విధించే ఆలోచనలో ఉంది. విమానం టేకాఫ్ కోసం టాక్సీయింగ్ చేస్తున్న సమయంలో ఒక ప్యాసింజర్ సీట్ బ్యాక్ పాకెట్‌లో ఉన్న పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం ఈ అనూహ్య నిర్ణయానికి కారణమైంది.
అదృష్టవశాత్తూ, విమాన సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఢిల్లీ నుంచి దిమాపూర్ వెళ్తున్న ఈ 6E 2107 విమానం వెంటనే తిరిగి బేకు చేరుకుంది. సిబ్బంది సరైన ప్రొసీజర్స్ ఫాలో అవ్వడం వల్ల సెకన్లలోనే ప్రమాదం అదుపులోకి వచ్చిందని ఇండిగో ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది.
ఈ ఘటనతో లిథియం బ్యాటరీతో నడిచే ఎలక్ట్రానిక్ పరికరాల భద్రతపై ఆందోళన పెరిగింది. అందుకే, DGCA ఇప్పుడు విమానాల్లో ప్యాసింజర్ల, ఎయిర్‌లైన్స్ తరఫున పవర్ బ్యాంక్‌ల వాడకంపై సమగ్ర సమీక్ష మొదలుపెట్టింది. ఈ రివ్యూలో పవర్ బ్యాంక్‌లను విమానంలో వాడకుండా నిషేధించడం, నిర్దిష్ట కెపాసిటీకి మించి తీసుకెళ్లడాన్ని తప్పనిసరిగా నియంత్రించడం లేదా పూర్తిగా బ్యాన్ చేయడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి.
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) కూడా ఈ విషయంలో దృష్టి సారించింది. భవిష్యత్తులో భద్రతా చర్యలను ఖరారు చేయడానికి ఈ రెండు ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తమ అన్ని విమానాల్లో పవర్ బ్యాంక్‌లను వాడటాన్ని నిషేధించింది. 100 వాట్ అవర్ కంటే తక్కువ రేటింగ్ ఉన్న వాటిని మాత్రమే క్యారీ చేయడానికి అనుమతిస్తుంది.
సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి ఇతర అంతర్జాతీయ విమాన సంస్థలు కూడా ప్రయాణ సమయంలో పవర్ బ్యాంక్‌లను వాడటం, ఛార్జ్ చేయడంపై ఆంక్షలు విధించాయి. పవర్ బ్యాంక్‌లలో ఉండే లిథియం-అయాన్ సెల్స్‌కు నాణ్యత లేకపోతే, ఉష్ణోగ్రత పెరుగుదల లేదా షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగవచ్చు. ఈ భద్రతా సమస్యల కారణంగా ఇండియన్ ఫ్లైట్స్‌లో పవర్ బ్యాంక్‌ల వాడకంపై త్వరలో కొత్త రూల్స్ వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates