నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది. మణిరత్నం సినిమాల్లో హిట్లు ఉండొచ్చు, ఫ్లాపులు ఉండొచ్చు. కానీ ఎందులో అయినా నటీనటుల అభినయం మాత్రం అద్భుతంగా ఉంటుంది.
‘అంజలి’ సినిమాలో చిన్న పిల్లల నుంచి కూడా అద్భుతమైన హావభావాలు రాబట్టుకున్న నైపుణ్యం మణిరత్నంది. చివరగా ‘థగ్ లైఫ్’ మూవీతో తీవ్రంగా నిరాశపరిచిన మణిరత్నం.. ఇప్పుడు తనదైన శైలిలో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీయడానికి రెడీ అవుతున్నారు. అందులో విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేస్తున్న విషయం ఇప్పటికే ఖరారైంది.
తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి ఇందులో హీరోయిన్‌గా నటించనుందట. లీడ్ పెయిర్ ఖరారైపోయినట్లు చెన్నై వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. విజయ్ సేతుపతి, సాయిపల్లవికి ఎవరికి వారు ఎంత మంచి పెర్ఫామర్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి అద్భుత అభినయానికి ఎన్నో సినిమాలు ఉదాహరణగా నిలుస్తాయి.
ఇలాంటి నటీనటులు మణిరత్నం చేతిలో పడితే.. వారి పెర్ఫామెన్స్ ఇంకో లెవెల్‌కు వెళ్తుందనడంలో సందేహం లేదు. సేతుపతి ఇప్పటికే మణిరత్నం సినిమా ‘నవాబ్’లో నటించాడు. అందులో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. సాయిపల్లవి తొలిసారి మణి దర్శకత్వంలో నటించబోతోంది.
చిన్న చిన్న దర్శకుల సినిమాల్లోనే సాయిపల్లవి పెర్ఫామెన్స్ అదరగొట్టేసింది. అలాంటిది మణిరత్నం సినిమాలో అంటే ఆమెకు నటన పరంగా కెరీర్ బెస్ట్ అయ్యే అవకాశముంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవిలో సెట్స్ మీదికి వెళ్లబోతున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates