ముంబయి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది మరో రికార్డు సృష్టించాయి. మతుంగా ప్రాంతంలోని జీఎస్బీ సేవామండల్ వినాయక మహోత్సవానికి ఏకంగా రూ.474.46 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్నారు. దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరుగాంచిన ఈ మండపం, ప్రతిసారి బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించబడుతుంది. అదే కారణంగా భీమా మొత్తం ఏటా పెరుగుతూనే వస్తోంది.
ఈ ఏడాది వినాయకుడికి అలంకరించనున్న బంగారం, వెండి ఆభరణాల విలువను దృష్టిలో పెట్టుకుని సుమారు రూ.67 కోట్ల బీమా కవరేజ్ ఇచ్చారు. గత రెండు సంవత్సరాల్లో ఈ మొత్తం వరుసగా రూ.38 కోట్లు, రూ.43 కోట్లుగా ఉంది. పూజారులు, నిర్వాహకులు, భద్రతా సిబ్బందికి కూడా ప్రత్యేకంగా రూ.375 కోట్ల వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవడం విశేషం.
అగ్నిప్రమాదం, భూకంపం వంటి అనుకోని ప్రమాదాలకు ఎదుర్కొనేందుకు అదనంగా రూ.2 కోట్ల బీమా తీసుకున్నారు. మండపంలో ఉండే ఫర్నీచర్, సీసీటీవీలు, కంప్యూటర్లు కూడా ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నాయి. పబ్లిక్ లయబిలిటీ కింద రూ.30 కోట్లు కేటాయించారు. అంటే ఏదైనా ప్రమాదంలో భక్తులకు జరిగే నష్టం కూడా భీమా కింద వస్తుంది.
భక్తులకు సౌలభ్యం కల్పించడానికి నిర్వాహకులు క్యూఆర్ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ మండపంలో ఆధునిక టెక్నాలజీతో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates