అగ్రరాజ్యం అమెరికాలో స్థిర నివాసానికి, వ్యాపార పెట్టుబడుల ద్వారా పొందే ఈబీ-5 వీసాల కోసం భారతీయుల ఆసక్తి భారీగా పెరిగింది. సాధారణంగా హెచ్1బీ, గ్రీన్‌కార్డులు పొందడం రోజురోజుకూ కష్టమవుతుండటంతో ఈ బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ వీసాలు ఎక్కువగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా వెల్లడైన గణాంకాల ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 2024 నుంచి జనవరి 2025 వరకు కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 1,200 మందికి పైగా భారతీయులు ఈబీ-5 వీసాల కోసం దరఖాస్తు చేశారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు వేగవంతంగా అందుబాటులో ఉండే ఈ ఈబీ-5 వీసాలే భారతీయులకు మొదటి ఆప్షన్‌గా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత 2024 ఆర్థిక సంవత్సరంలో 1,428 మందికి ఈ వీసాలు మంజూరు కాగా, అంతకుముందు ఏడాది మాత్రం ఈ సంఖ్య 815 మాత్రమే. ఇలా వేగంగా పెరుగుతున్న దరఖాస్తులతో అమెరికాలో భారతీయ వ్యాపారవర్గాల ప్రాభవం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ తరుణంలో అమెరికా ప్రభుత్వం ఇతర వర్గాల వీసాలకు నిబంధనలు కఠినతరం చేసింది. ముఖ్యంగా గ్రీన్‌కార్డ్ జారీకి సంబంధించిన స్క్రీనింగ్ ప్రక్రియ మరింత కఠినతరం చేయడంతో, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ వీసాలకు కూడా ఆ ప్రభావం పడింది. ఆగస్టు 1 నుంచి కొత్తగా అమలులోకి వచ్చిన ఈ నిబంధనలు పెండింగ్ దరఖాస్తులకు కూడా వర్తిస్తాయి. దీనివల్ల అనర్హమైన దరఖాస్తుదారులను తొలగించి, జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేకుండా చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, అమెరికాలోకి వచ్చే కుటుంబసభ్యుల వివాహ సంబంధాలు, కుటుంబ బంధాలు పక్కాగా నిరూపించాల్సి ఉంటుంది. వివాహాలకు సంబంధించిన జాయింట్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు, ఫొటోలు, బంధువులు, స్నేహితుల నుంచి వచ్చిన అభినందన పత్రాలు కూడా ఇవ్వాలని సూచించారు. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూలకు స్వయంగా హాజరుకావాల్సి ఉంటుంది.
ఈ విధమైన చర్యలతో నకిలీ వివాహాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించే వారిని నియంత్రించడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. చివరకు ఈ కొత్త కఠిన నిబంధనలతో వీసా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారి, నిజమైన అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates