ఢిల్లీ నగరంలోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో సంచలనం రేకెత్తించిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను తొలగించేందుకు కిరాతకంగా ప్రణాళిక రచించింది. మొదట భోజనంలో నిద్రమాత్రలు కలిపి హత్య చేయాలనుకున్నారు. కానీ అది ఫెయిల్ కావడంతో, చివరకు విద్యుత్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీశారు. ఈ ఘటన నవంబర్ 13న చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తమ్‌నగర్‌కు చెందిన సుస్మితకు, భర్త కరణ్ దేవ్ (36)తో సంబంధాలు సరిగ్గా లేవు. పెళ్లి తనకు ఇష్టం లేకపోవడంతో ఆమె గత కొంతకాలంగా భర్తతో విభేదించేది. ఈ నేపథ్యంలో, భర్తకు వరుసకు సోదరుడైన రాహుల్ (24)తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, ఇద్దరూ కలిసి హత్యకు ప్లాన్ చేశారు.
నవంబర్ 13వ తేదీ రోజున ముందుగా ఆమె భోజనంలో 15 నిద్రమాత్రలు కలిపి కరణ్‌కు తినిపించింది. అతడు పూర్తిగా మత్తులోకి వెళ్లినప్పటికీ, ప్రాణాలు మాత్రం పోలేదు. దీంతో వారు భర్తకు విద్యుత్ షాక్ ఇచ్చి చంపారు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు, విద్యుత్ షాక్ తగిలినట్లు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో కరణ్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు కూడా అనుమానం లేకుండా ప్రమాదమేనని భావించారు.
అయితే ఈ ఘటనపై పోలీసులు మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కరణ్ తమ్ముడు కునాల్ కూడా అనుమానించి, సుస్మిత మొబైల్‌ను తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఛాటింగ్‌లో ప్రియుడు రాహుల్‌తో హత్య ప్లాన్ గురించి చర్చించుకున్నట్లు స్పష్టమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇష్టం లేని వివాహాలు, అక్రమ సంబంధాలు, ఆర్థిక అంశాల వంటి కారణాలతో కుటుంబ సభ్యులే దారుణమైన హత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ ఘోరమైన ఘటన, కుటుంబ బంధాల్లో విలువలు ఎంతగా దిగజారుతున్నాయో తెలియజేస్తోంది. పోలీసులు ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates