కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. గడచిన ఎనిమిది మాసాల్లో ప్రపంచ దేశాల్లో నమోదైన కేసుల సంగతిని పక్కన పెట్టేసినా ఒక్క అమెరికాలోనే కేసుల సంఖ్య కోటి దాటేసింది. దాదాపు 2.5 లక్షల మంది చనిపోయారు. లాక్ డౌన్ లాంటి నిబంధనలను అమలు చేయటం, అమెరికా-ఇతర దేశాల మధ్య రాకపోకలను నిషేధించటం లాంటి నిబంధనలు కఠినంగా అమలు చేయటంతో కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లే అనిపించింది. అందుకే అమెరికా ప్రభుత్వం కాస్త రిలాక్స్ గా కనిపించింది. దాంతో జనాలందరు రోడ్లపైకి వచ్చేశారు.
అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా జరిగిన ర్యాలీలు, బహిరంగసభల కారణంగా వేలాదిమంది జనాలంతా మళ్ళీ ఒకేచోట గుమిగూడటం మొదలుపెట్టారు. దాంతో కరోనా వైరస్ మళ్ళీ విజృంభించింది. ఎన్నికలు అయిపోయినా కరోనా కేసులు మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది. గడచిన 6 రోజుల్లోనే అమెరికాలో 10 లక్షల కేసులు బయటపడటంతో జనాల్లో మళ్ళీ టెన్షన్ పెరిగిపోతోంది. న్యూయార్క్, న్యూ జెర్సీ, వాషింగ్టన్, నార్త్ కరోలినా, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఆసుపత్రుల సామర్ధ్యానికి మించి కేసులు పెరిగిపోతుండటంతో రోగులను చేర్చుకోవటం లేదు. ఒకవైపు రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోకపోవటం, లాక్ డౌన్ విధించటానికి అవుట్ గోయింగ్గ అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించకపోవటం లాంటి అనేక కారణాలతో మరణాల రేటు కూడా పెరిగిపోతోంది. ఒకపుడు న్యూయార్క్ లాంటి రాష్ట్రాల్లో వందలాది శవాలను దూరంగా ఎక్కడో ఉన్న దీవులకు తీసుకెళ్ళి సామూహికంగా దహనం చేసేసిన ఘటనలు చాలానే జరిగాయి.
అలాగే మరణించిన వారిని భద్రపరచటానికి మార్చురీలు కూడా నిండిపోవటంతో ఆసుపత్రి యాజమాన్యాలు మృతదేహాలను వరండాల్లోనే వదిలేసిన దృశ్యాలు అమెరికా అంతటా కనిపించాయి. అప్పటి సమస్యల నుండి అమెరికా పూర్తిగా కోలుకోలేదంటే మళ్ళీ ఆనాటి పరిస్ధితే కమ్ముకుంటోంది. రోజుకు లక్షన్నరకు మించి కేసులు నమోదైపోతుంటే ఏమి చేయాలో అర్ధంకాక ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారులు చేతులెత్తేస్తున్నారు. ఒకవైపు ట్రంప్-జోబైడెన్ మధ్య అదికార మార్పిడి గొడవలు, మరోవైపు మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కేసులతో ఏమి చేయాలో అధికారులకు దిక్కు తోచటం లేదు.