తన భార్య, కూతుళ్లతో ఉన్న గొడవల వల్ల విసిగిపోయి తనకు చెందిన రూ.4 కోట్ల రూపాయల విలువైన ఆస్తి పేపర్లను తీసుకెళ్లి ఓ గుడి హుండీలో వేసేసిన ఘటన ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసిన భార్య, కూతుళ్లు ఇప్పుడు ఆలయ అధికారులను సంప్రదించి ఆ ఆస్తి పేపర్లు తమకు ఇచ్చేయాలంటూ వేడుకుంటున్నారు. కానీ దీనిపై ఆలయ అధికారులు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వివరాల్లోకి వెళ్తే..
తిరువణ్ణామలై (అరుణాచలం) జిల్లాలోని అరణి సమీపంలోని కోనైయూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ విజయన్.. తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో ఉంటున్నాడు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన కస్తూరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మరో కుమార్తె సుబ్బులక్ష్మి వైద్యురాలిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం తండ్రి విజయన్‌కి, కుమార్తెకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. భార్యతోనూ ఆయనకు విభేదాలున్నట్లు తెలుస్తోంది.
కాగా అల్లుడి బంధువులు.. విజయన్‌ను బెదిరించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారం కోర్టుకు కూడా చేరింది. ఆస్తుల విషయంలో కూతుళ్లు తన మాట వినకపోవడంతో తీవ్రంగా కలత చెందిన విజయన్.. 4 కోట్ల రూపాయల విలువచేసే తన ఇళ్లు, పొలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను పాతవేడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీరేణుకాంబాల్ ఆలయంలోని హుండీలో వేశాడు. తన ఆస్తి అంతా ఆలయ ఖజానాకు చెందుతుందని ప్రకటించాడు. తాను కష్టపడి ఆస్తులను సంపాదించానని కానీ.. తన కుమార్తెలు ఆస్తి విషయంలో తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు విజయన్. అందుకే తన ఇష్టపూర్వకంగా ఆలయానికి తన ఆస్తులను ఇస్తున్నట్టు ప్రకటించాడు.
ఐతే విషయం తెలుసుకున్న విజయన్ కూతుళ్లు.. తండ్రి హుండీలో వేసిన ఆస్తి పత్రాలను తమకు ఇవ్వాలని ఆలయ అధికారులను సంప్రదించారు. తమ తండ్రితో పాటు తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఆస్తులు సంపాదించిందని, వారిద్దరూ ఉమ్మడిగానే ఇళ్లు, పొలాలు కొనుగోలు చేశారని వారు వాదిస్తున్నారు. తమ తండ్రి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే ఆలయ ఖజానాకు తమ ఆస్తులను ఇచ్చారని వారు ఆరోపించారు. ఆస్తి పత్రాల కోసం ఇద్దరు కూతుళ్లు, వారి భర్తలు ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఐతే గుడికి విరాళంగా ఇచ్చిన ఆస్తులను ఎలా తిరిగి ఇస్తామని అన్న అధికారులు.. నిబంధనల ప్రకారం జాయింట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలను అప్పగిస్తామని ప్రకటించారు. ఆస్తి పంపకాలకు సంబంధించిన కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి తీర్పు వస్తుంది.. ఆలయ అధికారుల తుది నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates