ఇదే చివ‌రి మ్యాచా అని ధోనీని అడిగితే..

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ప్ప‌టికీ.. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించి త‌న‌లో ఇంకా స‌త్తా త‌గ్గ‌లేద‌ని మ‌హేంద్ర‌సింగ్ ధోని చాటుతాడ‌ని అభిమానులు ఆశించారు. కానీ ఈసారి లీగ్‌లో బ్యాట్స్‌మ‌న్‌గా ఘోర వైఫ‌ల్యం చ‌విచూశాడు ధోని. వేగంగా ప‌రుగులు చేయ‌లేక‌, షాట్లు ఆడ‌లేక అత‌ను అవ‌స్థ‌లు ప‌డ్డ తీరును అంద‌రూ చూశారు. కెప్టెన్‌గా కూడా ధోని ఈసారి అంత ప్ర‌భావ‌వంతంగా క‌నిపించ‌లేదు.

చెన్నై లీగ్ బ‌రిలో ఉండ‌గా ప్లేఆఫ్‌కు చేర‌క‌పోవ‌డం ఇదే తొలిసారి. బ్యాట్స్‌మ‌న్‌గా, కెప్టెన్‌గా రెండు విధాలా ధోని విఫ‌ల‌మైన నేప‌థ్యంలో ఇక ఐపీఎల్‌లోనూ అత‌డి ప‌నైపోయింద‌న్న వ్యాఖ్యానాలు వినిపించాయి. చెన్నై జ‌ట్టు వ‌చ్చే సీజ‌న్‌కు కూడా అత‌ను కొన‌సాగాల‌నే కోరుకున్న‌ప్ప‌టికీ ధోని ఉంటాడా అన్న సందేహాలు క‌లిగాయి.

ఐతే ఇప్పుడు స్వ‌యంగా ధోనీనే ఆట‌కు టాటా చెప్పే విష‌యంలో స్ప‌ష్ట‌త ఇచ్చాడు. వ‌చ్చే ఐపీఎల్‌లోనూ తాను ఆడ‌బోతున్న‌ట్లు చెప్ప‌క‌నే చెప్పేశాడు. ఆదివారం ఈ సీజ‌న్లో చెన్నై చివ‌రి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు కామెంటేట‌ర్ డానీ మోరిసన్.. ధోనీని ఒక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న వేశాడు. ప‌సుపు రంగు దుస్తుల్లో ఇదే చివ‌రి మ్యాచా అని అడిగాడు. దానికి ధోనీ.. క‌చ్చితంగా కాదు అని స‌మాధానం ఇచ్చాడు. అంటే వ‌చ్చే సీజ‌న్లో కూడా ధోని ఉంటాడ‌ని స్ప‌ష్టం అయిపోయింది.

ఐతే త‌ర్వాతి సీజ‌న్‌కు ఇంకో ఐదు నెల‌లే స‌మ‌యం ఉంది. కాబ‌ట్టి ఇప్పుడు తాను త‌ప్పుకుని చెన్నై జ‌ట్టులో, అభిమానుల్లో అల‌జ‌డి రేప‌డం ఎందుక‌ని ధోని భావిస్తుండొచ్చు. ఈ ఐదు నెల‌ల్లో బాగా సాధ‌న చేసి వ‌చ్చే సీజ‌న్లో స‌త్తా చాటాల‌ని భావిస్తుండొచ్చు. ఐతే 2021లో ధోని ఆట ఎలా ఉన్నా అత‌ను ఐపీఎల్‌కు కూడా టాటా చెప్పే అవ‌కాశాలు మెండుగా ఉన్న‌ట్లే.