మహిళను హత్య చేసిన పూజారి, కోర్టు సంచలన తీర్పు

2023లో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్‌ అప్సర హత్యకేసులో నిందితుడైన పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. సాయికృష్ణ వృత్తిరీత్యా ఓ ఆలయంలో పూజారి. అదే ఆలయానికి తరుచూ వెళ్లే అప్సరతో పరిచయం ప్రేమగా మారింది. శారీరకంగా దగ్గరవడంతో ఆమె పెళ్లి కోరిక వ్యక్తం చేయడం ప్రారంభించింది. కానీ అప్పటికే వివాహితుడిగా, పిల్లల తండ్రిగా ఉన్న సాయికృష్ణ… అప్సర ఒత్తిడికి సిద్ధంగా లేకపోయాడు.

ఆమెను దూరం చేసుకోవాలని దురాలోచనకు పాల్పడి, కోయంబత్తూర్‌కు తీసుకెళ్దామని చెప్పి కారులో మొదట తిప్పాడు. శంషాబాద్ మండలంలోని సుల్తాన్‌పల్లి సమీపంలోని ఓ గోశాల వద్ద, సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో కారులో నిద్రిస్తున్న అప్సరపై అతను దాడి చేశాడు. మొదట ఆమెను ఊపిరాడకుండా చేసి చంపాలనుకున్నా, ఆమె ప్రతిఘటించడంతో తలపై రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సరూర్‌నగర్‌లోని ఎమ్మార్వో కార్యాలయం వెనుక డ్రైనేజ్ మాన్‌హోల్‌లో పడేశాడు.

బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, అనుమానాస్పదంగా ఉన్న సాయికృష్ణను విచారించగా అతను హత్యను అంగీకరించాడు. ఈ కేసును తీవ్రంగా పరిశీలించిన రంగారెడ్డి కోర్టు, నిందితుడు ఏకపక్షంగా బాధితురాలిని మోసం చేసి, పథకం ప్రకారం హత్యచేశాడని అభిప్రాయపడింది. దీంతో అతనికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి కొంత న్యాయం జరిగినట్టయినా భావించవచ్చు. ప్రేమ పేరుతో మోసం చేసి ప్రాణాలు తీసిన వారికి శిక్ష తప్పదన్న సందేశం ఈ కేసు ద్వారా వెలువడింది.