దేశంలో అత్యాచారాలు పెరిగిపోవడానికి యువతులకు లభించిన స్వేచ్ఛే కారణమని ఇటీవల ఓ కోర్టు వ్యాఖ్యానించి.. చేతులు కాల్చుకుంది. ఇదేసమయంలో ప్రతిష్టాత్మక అలహాబాద్ హైకోర్టు ఏకంగా.. యువతుల బస్ట్ తాకితే.. అది నేరం కాదని వ్యాఖ్యానించడమే కాకుండా.. ఈ కేసులో ఓ విద్యార్థి సంఘం నాయకుడికి బెయిల్ కూడా మంజూరు చేసింది. అతనిపై ఉన్న కేసును కొట్టి వేసే పిటిషన్‌పై విచారణ చేస్తామని ప్రకటించింది.
అయితే.. అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కేంద్రంలో మంత్రిగా ఉన్న బీజేపీ నాయకురాలు, ఐఐటీయెన్ అన్నపూర్ణాదేవి తీవ్రంగా తప్పుబట్టారు. ఇది సరైన తీర్పు కాదన్నారు. ఎలాంటి సందేశం ఇస్తున్నామని కూడా ఆమె బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పార్లమెంటులోనూ రెండు రోజులుగా ఆమె ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తిని అభిశంసించాలని కూడా.. పట్టుబడుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుపై నిప్పులు చెరిగింది.
యువతి ‘బస్ట్’ తాకితే నేరం కాదా?.. మనం ఏ యుగంలో ఉన్నాం అంటూ.. సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. ఆదిమానవుల సంస్కృతి మన సమాజంలో ఇంకా అంతరించలేదనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని తీవ్రంగా స్పందించింది. అంతేకాదు.. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కొట్టివేస్తున్నామని పేర్కొంది. ఈ తీర్పుపైనా.. నిందితుడికి బెయిల్ ఇవ్వడంపైనా స్టే విధించింది. ఇలా యువతుల బస్ట్ పై చేయి వేసినా.. తాకినా నేరం కాదని చెబుతున్నవారు.. ఒక్కసారి సమాజంలోకి వెళ్లి చూడాలని చురకలు అంటించింది.
తీర్పులు ఇచ్చే ముందు.. వ్యాఖ్యలు చేసే ముందు.. సమాజ స్థితి గతులను కూడా న్యాయమూర్తులు అర్థం చేసుకోవాలని సూచించింది. ఇక నుంచి వ్యాఖ్యలు చేసే ముందు.. న్యాయమూర్తులు.. జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. ఈ కేసును ఆది నుంచి తాము వింటామని.. నిందితులు ఎవరినీ బయటకు విడిచి పెట్టరాదని కూడా పేర్కొంది.