ఫైనల్‌కు కివీస్.. భారత్ పాత బాకీ తీర్చేనా?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత సాధించింది. రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 50 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్‌పై ఇప్పుడు పాత బాకీ తీర్చుకునే అవకాశంగా ఫ్యాన్స్ చూస్తున్నారు. ఆ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని రనౌట్ అయిన దృశ్యం ఇప్పటికీ అభిమానులను కలచి వేసేదే..

ఈసారి కూడా గ్రూప్ దశలో భారత్-న్యూజిలాండ్ పోరు జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ విజయాన్ని అందుకుంది. కానీ ఫైనల్‌లో మాత్రం ఇరు జట్ల మధ్య హోరాహోరీ సమరం జరుగుతుందని చెప్పవచ్చు. భారత్ ఇప్పటికే మూడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌కు చేరుకుంది. 2002లో శ్రీలంకతో టైగా ముగిసిన మ్యాచ్, 2013లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టైటిల్ గెలిచింది. ఇక 2025 ఫైనల్ గెలిచి మూడో టైటిల్ సాధించాలని టీమిండియా భావిస్తోంది.

ఈసారి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడం విశేషం. టాస్ గెలిచిన కివీస్ తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 362/6 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 102(94), రచిన్ రవీంద్ర 108(101) సెంచరీలు సాధించారు. మిచెల్ 49(37), ఫిలిప్స్ 49*(27) పరుగులతో కివీస్ భారీ స్కోరు సాధించడంలో సహకరించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3, రబాడా 2, ముల్డర్ 1 వికెట్ తీసుకున్నారు.

ఇక సఫారీ జట్టు 312/9 పరుగులకే పరిమితమైంది. డేవిడ్ మిల్లర్ 100*(67) తడాఖా చూపినా, మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బవుమా 56(71), డస్సెన్ 69(66) పరుగులతో నిలబడ్డారు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్ 3, ఫిలిప్స్ 2, హెన్రీ 2, బ్రేస్‌వెల్ 1, రచిన్ 1 వికెట్ తీసారు.

ఇక ఫైనల్ పోరులో న్యూజిలాండ్ గెలవాలని ఆశిస్తోంది. ఇప్పటివరకు ఐసీసీ వన్డే ట్రోఫీ గెలవని ఈ జట్టు, గతంలో అనేకసార్లు ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయింది. అయితే, భారత్ మాత్రం 2019 వరల్డ్ కప్‌లో ఎదురైన చేదు అనుభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్‌లో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.