ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్: నమ్మకం తగ్గుతోందా?

సోషల్ మీడియా వేదికగా బ్రాండ్ ప్రమోషన్‌లో ప్రభంజనంలా పెరిగిన ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఇప్పుడు నెమ్మదిగా నమ్మకాన్ని కోల్పోతుంది. ఒకప్పుడు నిజమైన సిఫారసుల్లా కనిపించిన కంటెంట్ ఇప్పుడు వ్యాపార ఉద్దేశంతోనిదనే అనుమానంతో వినియోగదారులు చూడటం ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, లింక్డ్ఇన్ వంటివి సాధారణ యూజర్లను ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మార్చాయి. కానీ, ఇప్పుడు అదే పద్ధతి ఇన్ఫర్మేషన్ కంటే అడ్వర్టైజింగ్‌గా మారిపోతుండటంతో ప్రేక్షకులు విసుగు చెందుతున్నారు.

ఇండియాలోని మెట్రో నగరాల వినియోగదారులపై ఐ క్యూబ్ వైర్ ( iCubesWire) నిర్వహించిన సర్వేలో 2,987 మందిలో 50 శాతం మంది ఇన్‌ఫ్లూయెన్సర్లను సినీ సెలబ్రిటీల కన్నా ఎక్కువగా నమ్మేవారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం తగ్గిందని 45 శాతం మంది చెప్పగా, 32 శాతం మంది పునరావృతమైన కంటెంట్‌ను చూసి విసిగిపోతున్నారని తెలిపారు. ఎక్కువగా #ad లేదా #sponsored హ్యాష్‌ట్యాగ్ ఉన్న పోస్టులు తక్కువ ఎంగేజ్‌మెంట్‌ను పొందుతున్నాయి. ఇది ఆ కంటెంట్ నిజమా, కేవలం బ్రాండ్ ప్రమోషన్ కోసమా అనే అనుమానాలను కలిగిస్తోంది.

ఇది కేవలం వినియోగదారుల అభిప్రాయంలోనే కాకుండా, రెగ్యులేటరీ పరంగా కూడా మార్పులు వచ్చాయి. భారతీయ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లూయెన్సర్లపై కఠినమైన నిబంధనలు తీసుకురావడం విశ్వాసం తగ్గడానికి ప్రధాన కారణమైంది. ఐ క్యూబ్ కు చేసిన మరో సర్వేలో 1,000 మంది పాల్గొనగా, 53 శాతం మంది ఇన్‌ఫ్లూయెన్సర్ కంటెంట్‌ను నమ్మలేమని, కేవలం 13 శాతం మాత్రమే పూర్తిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

అయితే, అన్ని ఇన్‌ఫ్లూయెన్సర్లపై నమ్మకం పూర్తిగా కోల్పోలేదని కూడా ఈ సర్వే చెబుతోంది. 47 శాతం మంది వినియోగదారులు ఇంకా కొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్లను విశ్వసిస్తారు. ముఖ్యంగా, మైక్రో ఇన్‌ఫ్లూయెన్సర్లు, 10 లక్షలకంటే తక్కువ ఫాలోవర్లున్న వారు, ఎక్కువ నమ్మకాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం వినియోగదారులు వ్యక్తిగత అనుభవాలను పంచుకునే, సక్రమమైన కంటెంట్‌ను అందించే వారిని నమ్ముతారు. కేవలం పది బ్రాండ్‌లను ప్రమోట్ చేసే వ్యక్తిని చూసి ఎవరూ ప్రభావితం కావడం లేదు.. అని నిపుణులు పేర్కొన్నారు.

ఇక కంటెంట్ పరంగా మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు 20-30 సెకన్ల రీల్స్ హవా ఉన్నప్పటికీ, ఇప్పుడు వినియోగదారులు 2 నిమిషాల నుంచి 20 నిమిషాలపాటు సాగే డీటైల్డ్ వీడియోలను ఎక్కువగా ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది. ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్ కన్నా పూర్తి సమీక్షతో కంటెంట్ చేస్తే ఎంగేజ్‌మెంట్ ఎక్కువగా వస్తుంది.. అని లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లూయెన్సర్స్ చెబుతున్నారు. చివరగా, ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఇంకా సమాధానమా? అనేది స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ, వాస్తవికత వ్యక్తిగత అనుబంధం ఉన్న కంటెంట్ ఇచ్చే ఇన్‌ఫ్లూయెన్సర్లు మాత్రమే ముందుకు సాగగలరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.