ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తోపులాట….

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉన్నట్టుండి కలకలం రేగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల మధ్య తోపులాట జరగగా… 15 మంది దాకా గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

తోపులాటతో అప్రమత్తమైన అధికారులు… క్షణాల్లో రంగంలోకి దిగిపోయారు. పరిస్థితిని చక్కదిద్దే యత్నాలను ప్రారంభించారు. ఫైరింజన్లు అక్కడకి పరుగులు పెట్టాయి. ఎంత వేగంగా తోపులాట జరిగిందో… అధికార యంత్రాంగం అప్రమత్తతో అంతే వేగంగా పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఈ ప్రమాదం గురించిన వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో ప్రారంభమైన కుంభమేళా ఈ నెల 26న ముగియనుంది. కుంభమేళా ముగింపు దగ్గరపడుతున్న క్రమంలో ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాల కోసం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు.

ఫలితంగా అటు ప్రయాగ్ రాజ్ లోనే కాకుండా ప్రయాగ్ రాజ్ కు దారి తీసే రహదారులు, రైల్వే లైన్లు, చివరాఖరుకు ప్రయాగ్ రాజ్ కు వెళుతున్న విమాన సర్వీసులు కూడా రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో శనివారం రాత్రి ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు భారీ ఎత్తున జనం వచ్చారు. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రైళ్లు ఆగే ఫ్లాట్ ఫామ్ లు 14, 15లపైకి జనం క్రమంగా చేరుకుంటున్నారు. చూస్తుండగానే… రెండు ప్లాట్ ఫారాలు జనంతో నిండిపోయాయి. అదే సమయంలో ప్రయాగ్ రాజ్ వెళ్లే రైళ్లు రద్దయ్యాయన్న వదంతులు వినిపించాయి. ఫలితంగా ఒక్కసారిగా ప్రయాణికుల్లో ఆందోళన పెరిగింది.

ఈ క్రమంలోనే ఒకరిని మరొకరు తోసుకుంటూ… సాగారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకోగా…చాలా మంది ప్రయాణికులు కిందపడిపోయారు. వారిలో 15 మంది గాయడపడ్డారు. వీరిలో శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్, పోలీసు, ఇతర విభాగాల సిబ్బంది క్షణాల్లో స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు.