కాలేజీ బాత్రూంలో జన్మనిచ్చి.. చెత్తకుప్పలో పడేసి క్లాస్ కు!

తెలిసినంతనే మనసంతా చేదుగా మారే ఉదంతంగా దీన్ని చెప్పాలి. అమ్మతనం లేకున్నా పర్లేదు.. కానీ మరీ ఇంత పాషాణ మనసా తల్లీ అనిపించే ఈ ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. కాలేజీ బాత్రూంలో జన్మనిచ్చి.. ఆ వెంటనే చెత్తకుండీలో పడేసి.. నింపాదిగా క్లాస్ రూంలోకి వెళ్లిన ఒక అమ్మాయి ఉదంతం గురించి తెలిస్తే ఒళ్లు జలదరించాల్సిందే. తమిళనాడులోని తంజాపూరు జిల్లా కుంభకోణంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే..

ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో చదివే 20 ఏళ్ల విద్యార్థిని గతంలో గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. గుట్టుగా తనలో తానే ఉంచేసుకుంది. శుక్రవారం ఎప్పటిమాదిరే కాలేజీకి వచ్చి పాఠాలు వింటున్న ఆమెకు.. హటాత్తుగా ప్రసవనొప్పులు వచ్చాయి.. కడుపునొప్పిగా ఉందని చెప్పి బాత్రూంకు వెళ్లిన ఆమె అక్కడ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం యూట్యూబ్ లో చేసి పేగు కట్ చేసి. పసికందును బాత్రూం సమీపంలోని చెత్తకుప్పలో పడేసింది.

అనంతరం ఏమీ జరగనట్లుగా క్లాస్ రూంలోకి వచ్చి కూర్చుంది. దుస్తులకు రక్తం మరకలు అంటి ఉండటాన్ని తోటి విద్యార్థినులు అడగ్గా.. రుతుక్రమం కారణమని చెప్పింది. అయితే.. ఆమెకు రక్తస్రావం అధికం కావటంతో ఉపాధ్యాయులు 108కు ఫోన్ చేసి అంబులెన్సును తెప్పించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పుడే ఆమెకు ప్రసవం అయినట్లుగా చెప్పటంతో అంతా షాక్ తిన్నారు. దీంతో ఏం జరిగిందని టీచర్లు అడగ్గా.. జరిగిన విషయాన్ని సదరు విద్యార్థిని చెప్పింది. దీంతో కాలేజీ ప్రాంగణాన్ని గాలించి చెత్తకుప్పలో కొనఊపిరితో పడి ఉన్న పసికందును ఆసుపత్రికి చేర్చారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ వైనం విన్న వారంతా సదరు విద్యార్థిని తీరుకు నోట మాట రాలేనంత షాక్ కు గురవుతున్నారు.