సినిమాలు… అది కూడా తెలుగు సినిమాల్లో దొంగలను హీరోలుగా చిత్రీకరిస్తూ చాలా సినిమాలే వచ్చి ఉంటాయి. వాటిలోని మలుపులను మించిన రియల్ స్టోరీ ఒకటి తెర మీదకు వచ్చింది. శనివారం వీకెండ్ సందర్భంగా ఈ స్టోరీని సైబరాబాద్ పోలీసులు వెలికి తీశారు. ఈ ఘటనలో అరెస్ట్ అయిన నిందితుడు నిజంగానే సినిమాల్లో కనిపించే రౌడీ హీరోనే. ఎందుకంటే…అతడి చోరీ కళ సినిమా స్టోరీలకు ఏమాత్రం తక్కువైనది కాదు. ఇంకా చెప్పాలంటే సినిమాలను మించి అతడు తన చోరీ కళను సాగించాడు. ఇక పోలీసుల నుంచి అతడు తప్పించుకున్న తీరు అయితే నభూతో నభవిష్యత్తు అని చెప్పక తప్పదు. ట్విస్టుల మీద ట్విస్టులున్న ఈ రియల్ స్టోరీ భాగ్యనగరిలోని ప్రిజమ్ బార్ వేదికగా నిలిచింది.
ఈ రౌడీ హీరో విషయానికి వస్తే…బత్తుల ప్రభాకర్ అనే ఓ దొంగ మామూలోడు కాదు. సీసీకెమెరాలకు చిక్కకుండా నిత్యం ముఖానికి మాస్కులతో సాగే ఇతగాడు.. ఏళ్ల తరబడి రెండు తెలుగు రాష్ట్రాల్లో చోరీలు చేస్తూనే ఉన్నాడు. అది కూడా ఏపీలో విశాఖ, తెలంగాణలోని హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలనే అతడు టార్గెట్ చేస్తున్నాడు. ఈ నగరాల్లోనూ నిత్యం డబ్బుల కట్టలు నాట్యం చేసే సంపన్న ప్రాంతాలు.. వాటిలోనూ ఏడాదంతా డబ్బులు తిరిగే ఇంజినీరింగ్ కళాశాలలు ఉండే ప్రాంతాలనే ఎంచుకుంటాడట. చోరీలో దొరికిన సొమ్ముతో ఇతగాడు హై ఫై ఏరియాల్లోని బార్లు,పబ్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తాడట. ఇప్పటిదాకా ఇతగాడిపై 80 దాకా చోరీ కేసులు నమోదై ఉన్నాయట. 2022లో విశాఖ పోలీసులకు పట్టుబడ్డా… కోర్టు నుంచి జైలుకు తరలిస్తుండగా… అతడు అత్యంత చాకచక్యంగా తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరక్కుండా తన పని తాను చేసుకుంటూనే పోతున్నాడు.
ఇటీవలే మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ జరగ్గా… అందులో ప్రభాకర్ వేలిముద్రలు దొరికాయట. దీంతో మాదాపూర్ సీసీఎస్ పోలీసులు గత కొంతకాలంగా వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో వీకెండ్స్ ప్రిజమ్ పబ్ పరిసరాలకు వస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. శనివారం సాయంత్రం మాదాపూర్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి అక్కడ తన సిబ్బందితో కలిసి అతగాడి కోసం మాటు వేశారు. అక్కడికి రావడంతోనే పోలీసులను గుర్తించిన ప్రభాకర్ తప్పించుకునే క్రమంలో నేరుగా ప్రజమ్ పబ్ లోకి దూరాడు. అతడిని వెంబడించిన పోలీసులు అందులోకి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులపై అతడు కాల్పులకు దిగాడు. అతడి పిస్టల్ నుంది దూసుకువచ్చిన ఓ బుల్లెట్ వెంకట్రామిరెడ్డి తొడలోకి దూసుకుపోయింది. పబ్ కు చెందిన ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ఇంత జరిగినా పట్టువదలని పోలీసులు.. ప్రభాకర్ ను ఒడిసి పట్టేశారు.
అనంతరం ప్రభాకర్ ను తనిఖీ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. ప్రభాకర్ చేతిలోని పిస్టల్ లో ఇంకా 23 బుల్లెట్లు ఉన్నాయట. వీటన్నింటినీ అతడు వినియోగించి ఉంటే… ప్రిజమ్ పబ్ లో ప్రళయమే జరిగి ఉండేది. అంతేనా.. అతడి కోటును తరచి చూస్తే… అందులో ఇంకో పిస్టల్ కూడా ఉందట. ఏకకాలంలో రెండు పిస్టళ్లను క్యారీ చేస్తున్నాడంటే ఇతగాడు ఎంత నేర్పరో ఇట్టే అర్థం కాక మానదు. అంతేకాకుండా పోలీసులను చూసినంతనే అతగాడు లంఘించిన తీరు, పబ్ లో కాప్పులు జరిపిన తీరు అతడిలోని నిర్భీతిని బయటపెడుతోంది. ఏమాత్రం భయం లేకుండా తిరుగుతున్న అతగాడిని పట్టేసిన హెడ్ కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతగాడి వివరాలను సైబరాబాద్ సీపీ అభిషేక్ మహంతి వివరించిన సందర్భంగా పోలీసులే నోరుళ్లబెట్టారట.