టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలన్న ఆశలు తారుమారయ్యాయి. సిడ్నీలో జరిగిన ఐదో టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించడంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1-3 తేడాతో ఆసీస్ చేతుల్లోకి వెళ్లింది. ఈ పరాజయంతో భారత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 50 పీసీటీ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన భారత్ ఫైనల్ అవకాశాలను కోల్పోయింది.
ఆస్ట్రేలియా 63.73 పీసీటీ పాయింట్లతో తొలిస్థానంలో నిలిచింది. ఇదివరకే 66.67 పీసీటీ పాయింట్లతో దక్షిణాఫ్రికా ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ రెండే జట్లు జూన్ 11న లార్డ్స్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనున్నాయి. భారత్‌కు సంబంధించిన ఈ సైకిల్‌లో మ్యాచ్‌లు ముగియగా, ఇతర జట్లకు కూడా ఫైనల్ చేరుకునే అవకాశం లేకుండా పోయింది.
సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా, బౌలర్ స్కాట్ బోలాండ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మరోవైపు, భారత బౌలింగ్ దళానికి కీలకంగా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్నాడు. సిరీస్‌లో భారత్ మొదటి మ్యాచ్‌లో విజయం సాధించినా, ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
దాదాపు దశాబ్ద కాలం తర్వాత టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకోవడం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. ఈ సిరీస్‌లో టీమిండియా జట్టు ప్రదర్శనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనల్ చేరేందుకు అవసరమైన స్థిరత్వం, సరైన సమీకరణలు పాటించకపోవడం భారత దురదృష్టంగా మారిందని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.