అంతరిక్షంలో సునీతా విలియమ్స్.. మరింత ఆలస్యం!!

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) గడపాల్సిన సమయం అనూహ్యంగా పెరిగింది. 2025 మార్చి వరకు ఆమె ఐఎస్ఎస్‌లోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎనిమిది రోజుల ప్రయోగాల కోసం జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ ద్వారా బచ్ విల్‌మోర్‌తో కలిసి సునీత ఐఎస్ఎస్‌కు వెళ్లారు. ఈ ప్రయాణం అనంతరం జూన్ 14న భూమికి తిరిగి రావాల్సి ఉండగా, క్యాప్సూల్‌లో హీలియం లీకేజీ కారణంగా ఆ ప్రయాణం వాయిదా పడింది.

వ్యోమనౌక మాత్రమే భూమికి తిరిగి వచ్చి, వారు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి సునీత, విల్‌మోర్ ఐఎస్ఎస్‌లో ఉన్నారు. అయితే, భూమికి తిరిగి రావడానికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యామ్నాయం దొరకలేదు. గత నెలలో నాసా స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్‌ను ప్రయోగించింది. ఈ మిషన్‌లో నాలుగు సీట్లతో పాటు, సునీతా, విల్‌మోర్ కోసం ప్రత్యేకంగా రెండు సీట్లు ఖాళీగా ఉంచారు.

అయితే, ఈ మిషన్ ఫిబ్రవరి 2025లో మాత్రమే భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. ఇది సునీత, విల్‌మోర్ ఎదురుచూపులకు మరో నెల జోడిస్తోంది. మరోవైపు, క్రూ-9 సిబ్బందిని భర్తీ చేయడానికి క్రూ-10 మిషన్‌ను నాసా ప్రణాళికలో ఉంచింది. అయితే ఈ ప్రయోగం వచ్చే మార్చి కంటే ముందుకు జరగబోదని తెలుస్తోంది. దాంతో, సునీత, విల్‌మోర్ భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

ఐఎస్ఎస్‌లో వీరు తాత్కాలికంగా మరిన్ని ప్రయోగాల్లో భాగస్వామ్యమవుతున్నప్పటికీ, వారి ఆరోగ్య పరిస్థితులపై ఈ ఆలస్య ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో అనేక రికార్డులు సృష్టించిన ప్రముఖ వ్యోమగామిగా ఇప్పటికే మంచి గుర్తింపుని అందుకున్నాడు. కానీ ఈ సాంకేతిక లోపం ఆమె మిషన్‌ను పొడిగించి, ఆందోళనకర పరిస్థితి ఏర్పరచింది. నాసా, స్పేస్ఎక్స్ వంటి సంస్థలు సమస్యను తక్షణమే పరిష్కరించి, వీరిని భూమికి సురక్షితంగా తీసుకురావాలని అందరూ ఆశిస్తున్నారు.