మీడియాపై మోహ‌న్‌బాబు దాడి.. అసలు ఏం జ‌రిగింది?

మంచు మోహ‌న్‌బాబు కుటుంబంలో త‌లెత్తిన ఆస్తుల వివాదం.. తీవ్ర దుమారానికి దారితీసింది. ఏకంగా మీడియాపైనే మోహ‌న్ బాబు దాడి చేయ‌డంతోపాటు బౌన్స‌ర్ల‌ను ఉసిగొల్పారు. దీంతో మీడియా ప్ర‌తినిధులు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని త‌లో దిక్కూ ప‌రుగులు పెట్టారు. దీనికి సంబంధించిన విజువ‌ల్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. దీంతో అస‌లు ఏం జ‌రిగింది? మీడియాపై ఎందుకు దాడి చేశార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

గ‌త రెండు రోజులుగా మోహ‌న్ బాబు ఆస్తుల‌కు సంబంధించి చిన్న కొడుకు మ‌నోజ్‌తో ఆయ‌న ఘ‌ర్ష‌ణ ప‌డుతున్నార‌న్న విష యం తెలిసిందే. అయితే.. మ‌నోజ్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం త‌న భార్య‌తో క‌లిసి.. ఐజీని క‌లిసివ‌చ్చారు. అప్ప‌టికిరాత్రి 8 గంట‌ల స‌మ‌యం అవుతుంది. ఈ స‌మ‌యంలో మీడియాను కూడా ఆయ‌న వెంట తీసుకువెళ్ల‌డం గ‌మ‌నార్హం. జ‌ల్‌ప‌ల్లిలోని నివాసానికి చేరుకున్న మీడియా గేటు ద‌గ్గ‌రే ఉంది. అయితే.. లోప‌లికి భార్య‌తో కూడా వెళ్లిన మ‌నోజ్‌.. కొద్ది సేప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న దుస్తులు చిరిగి క‌నిపించాయి.

ఈ ప‌రిణామాల‌పై మీడియా లైవ్ క‌వ‌రేజీ ఇచ్చింది. మోహ‌న్‌బాబు, ఆయ‌న పెద్ద కొడుకు విష్ణు స‌హా మ‌రికొంద‌రు మ‌నోజ్‌పై దాడి చేశారంటూ. ప్ర‌చారం జ‌రిగింది. ఆ వెంట‌నే బ‌య‌ట‌కు దూసుకు వ‌చ్చిన మోహ‌న్‌బాబు.. త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లోకి ప్ర‌వేశించిన మీడియా ప్ర‌తినిధుల‌ను తిడుతూ.. దూసుకువ‌చ్చారు. ఓ మీడియా మైకును బ‌లంగా గుంజుకుని దాంతోనే ఆయ‌న కొట్టేందుకు ప్ర‌య‌త్నించారు. ఇంత‌లో జోక్యం చేసుకున్న బౌన్స‌ర్లు.. మీడియా ప్ర‌తినిధుల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఓ మీడియా ప్ర‌తినిధి కింద ప‌డిపోయారు. ఆయ‌న‌పైనుంచే ఒక‌రిద్ద‌రు తొక్కుకుంటూ వెళ్ల‌డం వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపించింది.

అనంత‌రం.. బౌన్స‌ర్లు.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో మీడియా ప్ర‌తినిధులు ప్రాణ భ‌యంతో ప‌రుగులు పెట్టారు. త‌ర్వాత గేటును మూసేశారు. ఈ క్ర‌మంలో అక్క‌డే ఉన్న పోలీసులు కూడా.. నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోవ‌డం.. క‌నిపించింది. అనంత‌రం..మోహ‌న్‌బాబు వ‌ద్ద లైసెన్స్‌డ్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప‌రిణామాల‌పై స్పందించిన మోహ‌న్‌బాబు.. త‌న చిన్న కొడుకే త‌న గుండెల‌పై త‌న్నాడ‌ని.. భార్య చెప్పుడు మాట‌లు వింటున్నాడ‌ని ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. మోహ‌న్‌బాబు త‌మ‌పై దాడి చేశారంటూ.. మీడియా ప్ర‌తినిధులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.