ఈసారి ఐపీఎల్లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. వరుసగా రెండు మ్యాచుల్లో అదరగొట్టి టోర్నీలో శుభారంభం చేసింది. కానీ ఆ తర్వాత అంచనాల్ని అందుకోలేక చతికిలబడింది. తొలి రెండు మ్యాచుల్లో చెలరేగిన సంజు శాంసన్, స్టీవ్ స్మిత్.. తర్వాతి మ్యాచుల్లో తేలిపోయారు.
ముందు చాలా బలంగా కనిపించిన రాజస్థాన్ బ్యాటింగ్ ఒక్కసారిగా బలహీనంగా మారిపోయింది. టాప్ ఆర్డర్ ఫెయిలైతే బ్యాటింగ్‌ను నడిపించే ఆటగాడే కనిపించట్లేదు. మిడిలార్డర్ బలపడితే తప్ప ఆ జట్టు రాత మారేలా లేదు. అలాగే ఆ జట్టు బౌలింగ్ కూడా బలం పుంజుకోవాల్సి ఉంది. ఇలాంటి సమయంలోనే ఆ జట్టులోకి ఒక మేటి ఆటగాడొస్తున్నాడు. అతనే.. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.
ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో స్టోక్స్ ఒకడు. అతణ్ని రూ.12.5 కోట్లకు రాజస్థాన్ కొన్నేళ్ల కిందట కొనుక్కుంది. అప్పట్నుంచి ఓ మోస్తరు ప్రదర్శన చేస్తున్నాడతను. ఐతే గత సీజన్లతో పోలిస్తే స్టోక్స్ మీద ఈసారి అంచనాలు భారీగా ఉన్నాయి. అందుక్కారణం గత ఏడాది కాలంలో అతడి ప్రదర్శన ఓ రేంజిలో ఉండటమే. గత ఏడాది ప్రపంచకప్‌లో అతడి వీరోచిత విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్ గెలవడంలో అతడి పాత్ర కీలకం. ఫైనల్లో అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత కూడా ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో ఇంగ్లాండ్‌కు అనేక విజయాలందించాడు. ఐపీఎల్‌లోనూ ఇదే ఫాంను కొనసాగిస్తాడని అనుకుంటుండగా.. నెలన్నర కిందట తన తండ్రి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డట్లు తెలిసి పాకిస్థాన్‌తో సిరీస్ నుంచి అర్ధంతరంగా తప్పుకుని న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. అప్పట్నుంచి తండ్రి పక్కనే ఉంటున్నాడు. ఒక దశలో అతను ఐపీఎల్‌కు రాడని వార్తలొచ్చాయి. కానీ స్టోక్స్‌ను వెళ్లి ఐపీఎల్ ఆడమని తండ్రే చెప్పాడట.
దీంతో అతను న్యూజిలాండ్ నుంచి బయల్దేరి యూఏఈ చేరుకున్నాడు. ఇప్పటికే క్వారంటైన్లో ఉన్న అతను రాజస్థాన్ తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నాడ. టామ్ కరన్ స్థానంలో స్టోక్స్‌ను ఆడించే అవకాశముంది. అతను స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే రాజస్థాన్‌కు తిరుగుండదనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates