పశ్చిమ ఆఫ్రికా దేశం గినియాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ తీవ్ర విషాదానికి కారణమైంది. ఆ దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన జెరెకొరెలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్ల అభిమానుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. ఈ దుర్ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు.
ఫుట్‌బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. ఒక జట్టు అభిమానులు మైదానంలోకి చొచ్చుకురావడంతో, ప్రతిదాడికి దిగిన అవతలి జట్టు అభిమానులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో చిన్న వివాదం క్షణాల్లో పెరిగి పెద్ద ఘర్షణగా మారింది. మైదానంలోనే కాకుండా వీధుల్లో కూడా దాడులు కొనసాగాయి. వేలాది మంది అభిమానులు రోడ్లపైకి వచ్చి పరస్పరం దాడులకు దిగారు.
ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో కొందరు అభిమానులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. రోడ్లపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం స్థానికులను కలవరపెట్టింది. దాడుల్లో గాయపడిన అనేకమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ్ గౌరవార్థం ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు అనేక మంది ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ విధంగా ఘర్షణలు జరిగి, అంత పెద్ద ప్రాణనష్టం చోటుచేసుకోవడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మిలిటరీ పాలన ఉన్న గినియాలో ఇదే మొదటిసారి ఫుట్‌బాల్ సంబంధిత హింసకర ఘటనలు జరగడం కాదు. గతంలోనూ ఈ తరహా వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై గినియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు
Gulte Telugu Telugu Political and Movie News Updates