క‌రోనా ఎఫెక్ట్‌: శ్రీవారి ఆపాద మ‌స్త‌క ద‌ర్శ‌న సౌభాగ్యం

క‌రోనా మ‌నుషుల జీవితాల‌ను, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను, ఏకంగా ఈ ప్ర‌పంచాన్ని కూడా చాలా ప్ర‌భావితం చేసింది. ఎన్నెన్నో రంగాల్లో.. ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, క‌రోనా ప్ర‌భావం కొన్ని చోట్ల‌.. కొంత‌మందికి క‌ల్పించిన వెసులుబాటు న‌భూతో అన‌వ‌ల‌సిందే! ఇలాంటి అవ‌కాశాల్లో.. ఒక‌టి తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం!! నిత్యం ల‌క్ష‌ల మంది భ‌క్తులు.. అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని.. తిరుమ‌ల చేరుకుని.. క్యూలైన్లు ఎంత బారున్నా.. ఎంత ర‌ద్దీ ఉన్నా.. గంట‌ల కొద్దీ వాటిలో నిల‌బ‌డి.. శ్రీవారి ద‌ర్శ‌న భాగ్యం కోసం త‌పిస్తార‌నే విష‌యం తెలిసిందే.

అయితే, ఇలా ఎంత క‌ష్ట‌ప‌డి వెళ్లినా.. ఎన్ని మెట్లెక్కినా.. ఎన్ని గంట‌లు ప్ర‌యాణం చేసినా.. త‌న‌వితీరా స్వామిని ద‌ర్శించామ‌‌నే భావ‌న‌, తృప్తి.. చాలా చాలా త‌క్కువ మందికి ఉంటుంది. వీఐపీ ద‌ర్శ‌నం అయితే.. ఓకే.. కానీ, సాధార‌ణ భ‌క్తులు మాత్రం స్వామిని త‌నివి తీరా.. మ‌న‌సారా.. ద‌ర్శించుకునే భాగ్యం క‌లిగే అవ‌కాశమే లేదు. రెప్ప‌పాటు కాలంలో స్వామిని ఇలా ద‌ర్శించి అలా లైన్‌లో మ‌ళ్లిపోవ‌డ‌మే! సాదార‌ణ రోజుల్లోనే ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఇక‌, బ్ర‌హ్మోత్స‌వాలు.. పండుగ‌లు… వ‌రుస సెల‌వులు వంటి కీల‌క రోజుల్లో అయితే.. ల‌ఘు ద‌ర్శ‌నం, మ‌హా ల‌ఘు ద‌ర్శ‌నాల‌తోనే స‌రిపుచ్చుకుని ఇదే మా భాగ్యం స్వామీ అని తృప్తి చెందాల్సిందే!!

అంత‌లా.. తిరుమ‌ల గిరులు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడిపోయేవి. అయితే, క‌రోనా పుణ్య‌మా అని.. తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ పూర్తిగా త‌గ్గిపోయింది. రోజుకు కేవ‌లం 20 వేల మంది లోపు భ‌క్తులు మాత్ర‌మే శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌స్తున్నారు. వీరిలోనూ రూ.300 టికెట్లు పొందిన‌వారే ఎక్కువ‌. మిగిలిన వారిలో సాధార‌ణ ద‌ర్శ‌నం భ‌క్తులు ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్ర‌మే వీఐపీ ద‌ర్శ‌నాల‌కు క్యూక‌డుతున్నారు. పైగా ప్ర‌తి ఒక్క‌రికీ ముందుగానే ఆన్‌లైన్‌లో టైమ్ స్లాట్‌ను బుక్ చేస్తున్నందున‌.. ఎక్క‌డా భ‌క్తులు క్యూలైన్‌లో వేచి ఉండ‌డం కానీ, ర‌ద్దీ క‌నిపించ‌డం కానీ లేదు.

పైగా.. స్వామివారి ద‌ర్శ‌నం కోసం దేవ‌స్థానం కేటాయిస్తున్న స‌మ‌యం కూడా ఎక్కువ‌గా నే ఉంటోంది. దీంతో లైన్‌లో నుంచే స్వామిని ఆపాద మ‌స్త‌కం.. త‌నివితీరా ద‌ర్శించుకునే భాగ్యం ద‌క్కింద‌ని భ‌క్తులు పొంగిపోతున్నారు. కోనేటి రాయుడిని క‌నులార వీక్షించే భాగ్యం క‌లిగిందంటూ.. ఆనంద‌ప‌ర‌వ‌శులు అవుతున్నారు. బంగారు వాకిలి నుంచి వెండివాకిలి.. వ‌ర‌కు ఆనందం నిల‌యం దాకా.. ర‌ద్దీ అన్న‌మాటే క‌నిపించ‌డం లేదు. దీంతో రెప్ప‌పాటు ల‌భిస్తేనే ఎక్కువ‌నుకున్న విరాట్ స్వ‌రూపం.. ఇప్పుడు సంపూర్ణంగా వీక్షించి త‌రించేందుకు అవ‌కాశం ల‌భించింది.

దీనంత‌టికీ కార‌ణం.. క‌రోనా.. వైర‌స్ భ‌యంతో తిరుమ‌ల ద‌ర్శ‌నాల‌పై అధికారులు ఆంక్ష‌లు విధించారు. దీంతో భ‌క్తుల రాక త‌గ్గింది. ఇక‌, ఈ త‌ర‌హా ఆంక్ష‌లు ఈ ఏడాది డిసెంబ‌రు వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రెందుకు ఆల‌స్యం.. మీరూ స్వామిని సంపూర్ణంగా ద‌ర్శించుకునేందుకు బ‌య‌లుదేరండి.. అయితే.. ఒక్క‌టే ష‌ర‌తు… ఏద‌ర్శ‌నం కావాల‌న్నా.. ఆన్‌లైన్‌లో ముందుగా మీ వివ‌రాలు న‌మోదు చేసుకుంటేనే.. అలిపిరి నుంచి అనుమ‌తిస్తార‌నే విష‌యం మ‌రిచిపోవ‌ద్దు!!