‘మంచు’ దెబ్బకు చిరు కాడె వదిలేశాడా?

ఎవరు ఏమన్నా సరే.. దాసరి నారాయణ రావు తర్వాత ఒక బాధ్యత తీసుకుని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నది మెగాస్టార్ చిరంజీవే. ముందు వేరే సినీ పెద్దలు దాసరి స్థానంలోకి రావాలని చిరును కోరితే సున్నితంగా తిరస్కరించిన చిరు.. ఆ తర్వాత రకరకాల కారణాలతో, నెమ్మది నెమ్మదిగా ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా మారారు.

కరోనా టైంలోనే కాక వివిధ సందర్భాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనేక కార్యక్రమాల కోసం కోట్ల రూపాయల విరాళాలు అందజేశారు. ఒక టీంను పెట్టుకుని సేవా కార్యక్రమాలు జరిపించారు. అంతే కాక వ్యక్తిగతంగా చాలా మందికి ఆర్థిక సాయం అందించడం, ఇంకో రకమైన తోడ్పాటునివ్వడం లాంటివి చేశారు.

సినీ పరిశ్రమలో ఏవైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు ముందు నిలిచారు. కరోనా టైంలో, ఆ తర్వాత సినీ పరిశ్రమలో ఏ సమావేశం జరిగినా నేతృత్వం వహించింది చిరంజీవే. ఈ విషయంలో ఎవరూ చిరును నిందించడానికి, ప్రశ్నించడానికి అవకాశం లేకుండా చూసుకున్నారాయన.

ఐతే ఇటీవలి ‘మా’ ఎన్నికల వ్యవహారంతో కథ మారినట్లు కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్‌కు పరోక్ష మద్దతు ఇచ్చిన చిరంజీవిపై కొంత వ్యతిరేకత వచ్చింది. చిరు పట్ల అసూయతోనో, అసంతృప్తితోనో ఉన్న వాళ్లంతా మంచు విష్ణు క్యాంపులో చేరిపోయారు. ఈ క్రమంలో చిరు చేసిన మంచినంతా కూడా మరిచిపోయి కొందరు కామెంట్లు చేశారు.

ముఖ్యంగా నరేష్ లాంటి వాళ్లయితే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు స్థానం ఖాళీ ఉందని, మోహన్ బాబు ఆ స్థానంలోకి రావాలని విడ్డూరమైన వ్యాఖ్య కూడా చేశారు. మరోవైపు ప్రకాష్ రాజ్ ఓటమితో చిరు ప్రతిష్ఠ కొంత దెబ్బ తింది. ఈ పరిణామంతో చిరంజీవి కొంచెం నిరాశకు గురైనట్లు కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లూ సినీ పరిశ్రమ సమస్యలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అధినేతల్ని కలిసినపుడల్లా నాయకత్వ బాధ్యతలు తీసుకున్న చిరంజీవి.. ఇప్పుడు సైలెంటైపోయారు.

తాజాగా నాగార్జున, నిరంజన్ రెడ్డి తదితరులు వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇందులో నాగ్ వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఏమైనా ముడిపడి ఉన్నాయేమో తెలియదు కానీ.. బయటికైతే సినీ పరిశ్రమ సమస్యల మీదే నాగ్ ఏపీ సీఎంను కలిసినట్లుగా చెబుతున్నారు. ఇదే నిజమైతే ‘మా’ ఎన్నికల రభసతో కినుక వహించిన చిరు ఇండస్ట్రీ నాయకత్వ బాధ్యతలకు దూరమయ్యారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.