ఎంసెట్‌-2 లీకేజీ లో ఎవరి పాపం ఎంత?

ఎంసెట్‌-2 లీకేజీ లో ఎవరి పాపం ఎంత?

తెలంగాణలో ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారం రెండు శాఖల మంత్రుల మధ్య చిచ్చురేపుతోంది. విద్యాశాఖ, వైద్య శాఖ మంత్రుల మధ్య తీవ్ర అగాధం ఏర్పడినట్లుగా తెలుస్తోంది.. వాస్తవంగా ఎంసెట్‌ తేదీ ఖరారు, పరీక్షల నిర్వహణ, పరీక్షా పేపర్లను డ్రా విధానంలో తీయడం, ఎంసెట్‌ ఫలితాల వెల్లడి తదితర అంశాలన్నీ ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి వస్తాయి..  అంటే ఈ శాఖను నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరగాలి.  కానీ.. ఇవన్నీ  వైద్య శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. ఎంసెట్‌కు సంబంధించి ఏ అంశం చర్చించాలనుకున్నా వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌, ఎమ్సెట్‌ కన్వీనర్లతో మంత్రి లక్ష్మారెడ్డి స్వయంగా చర్చించి నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు. ఎంసెట్‌-1, ఎంసెట్‌-2, నీట్‌-1, నీట్‌-2 అంశాలపై అధికారులతో చర్చించడమే కాకుండా మీడియాతో కూడా ఆయనే మాట్లాడుతూ వస్తున్నారు.

ఎంసెట్‌ ఫలితాల తర్వాత మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ నుంచి వైద్య శాఖ పరిధిలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. కానీ మొదటి నుంచి వైద్య శాఖే ఈ వ్యవహారాలన్నీ చూసింది.  ఇలా లక్ష్మారెడ్డి చొరవ తీసుకోవడం వల్ల ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఆగ్రహం కలిగిందని తెలుస్తోంది. ఈ పరిస్థితిలోనే ఎంసెట్‌ బాధ్యతను కడియం తీసుకోవడం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి వద్ద కూడా కడియం ఈ అంశాన్ని ప్రస్తావించారని సమాచారం.

మొత్తం మీద ఎంసెట్‌ వ్యవహారం ఇద్దరు మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిల మధ్య చిచ్చు పెట్టింది.  ఏ శాఖ పరిధిలో ఏం చేయాలన్న విభజన స్పష్టంగా ఉన్నప్పటికీ లక్ష్మారెడ్డి ఎందుకు ఇలా అతి చొరవ చూపారన్నది అర్థం కావడం లేదని కేసీఆర్‌ మంత్రివర్గంలోని పలువురు ఇతర నేతలు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English