తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని రాజకీయ దురంధరుడిగా.. చాణక్యుడిగా ఆయన అభిమానులు అభివర్ణిస్తుంటారు. బాబును రాజకీయంగా వ్యతిరేకించేవారు కూడా ఆయన రాజకీయ నైపుణ్యాలను ఆఫ్ ద రికార్డ్ కొనియాడుతుంటారు. చంద్రబాబు ఏమైనా చేయగలడంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూనే ఆయనకు ఎలివేషన్లు ఇస్తుంటారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార వైసీపీకి వ్యతిరేకంగా అందరినీ ఒక తాటికి తీసుకురావడంలో బాబు చాణక్యతను గమనించవచ్చు. ఇలా మూడు ప్రధాన పార్టీలను ఒక చోటికి తేవడమే కాదు.. సీట్ల పంపిణీలో తెలుగుదేశానికి ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవడంలోనూ ఆయన తన చాణక్యతను ప్రదర్శించారు.
జనసేనకు సరైన అభ్యర్థులు లేని చోట జనసేనానిని ఒప్పించి మండలి బుద్ధ ప్రసాద్ సహా కొందరు టీడీపీ నేతలను జనసేన తరఫున పోటీ చేయించడం బాబుకే చెల్లింది. ఇదంతా ఒకెత్తు అయితే.. పెద్దగా బలం లేకపోయినా పొత్తులో భాగంగా అత్యుత్తమ ప్రయోజనం పొందిందని.. స్థాయికి మించి స్థానాలు దక్కించుకుందని టీడీపీ, జనసేన వాళ్లు అసూయ చెందుతున్న బీజేపీని కూడా బాబు తన దారిలోకి తెచ్చుకోవడంలో బాబు విజయవంతం అయ్యారు.
టీడీపీ నేత జనసేన తరఫున పోటీ చేయడం విశేషం కాదు కానీ.. ఆ పార్టీకి చెందిన నేత బీజేపీ తీర్థం పుచ్చుకుని సీటు సంపాదించడం హైలైట్. అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇలాగే పోటీ చేస్తున్నారు. ముందు పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి ఇచ్చారు. కానీ అక్కడ నల్లమిల్లి బలమైన నేత కావడంతో జనాల నుంచి ఆయనకు బలమైన మద్దతు లభించింది. అలా అని బీజేపీకి ఈ సీటు దక్కకుండా బాబు ఆపలేరు. బీజేపీకి బలం లేకపోయినా సీటు వెనక్కి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థి కన్నా నల్లమిల్లి ఎంత మెరుగన్నది చెప్పి.. ఆ పార్టీలోకి నల్లమిల్లిని పంపి మరీ అక్కడ ఆయన్నే పోటీ చేయించడం నిజంగా బాబు చాణక్యతకు నిదర్శనమే.