ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోసారి జగనే అధికారంలోకి వస్తారని తన దగ్గర సమాచారం ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. విమర్శలు గుప్పించారు.
జూన్ 4వ తేదీ తర్వాత.. కేసీఆర్-జగన్ ఇద్దరూ చింతపిక్కల ఆట ఆడుకోవడమేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కే దిక్కులేదు. ఆయనే ఫామ్ హౌస్‌లో పడుకున్నాడు. రేపు ఆ పక్కనే మరో రూమ్ రెడీ చేస్తే.. జగన్ కూడా అక్కడకు వస్తాడు. అధికారంలోలేని ఈ ఇద్దరూ అక్కడ చింతపిక్కలాట ఆడుకుంటారు. ఒకవైపు కేసీఆర్, ఇంకోవైపు జగన్‌మోహన్ రెడ్డి ఆడుకుంటారు
అని బొండా ఉమా విరుచుకుపడ్డారు.
అహంకారులకు ఈ ప్రజాస్వామ్యంలో చోటు ఉండదని ఉమా తేల్చి చెప్పారు. అహంకారులకు, దుర్మార్గులకు, చట్టాన్ని అతిక్రమించేవారికి.. ఈ ప్రజాస్వామ్యంలో చోటు ఉండదన్నారు. ఇప్పటికైనా తెలుసుకో జగన్. జూన్ 4వ తేదీనే నువ్వు ఈ రాష్ట్రంలో ఉండేందుకు ఆఖరి రోజు. జూన్ 5వ తేదీ నుంచి ఆయన ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోతాడు. కేసీఆరా, కేటీఆరా.. ఎవరైనా సరే రాసిపెట్టుకోవాలి. మీకు అంత అభిమానం ఉంటే.. మీ పక్క ఒక రూం ఇవ్వండి
అని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.